Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ లో భారీ కుదుపులు తప్పవా?

వైసీపీ లో భారీ కుదుపులు తప్పవా?
X

ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. వైసీపీ అధినేత, సీఎం జగన్ హిట్ లిస్ట్ లో ఎంత మంది ఉన్నారు...ఎంత మందికి పూర్తిగా టికెట్స్ కట్ అవుతాయి..ఎంత మందికి స్దాన చలనం ఉంటుంది?అనేది ఇప్పుడు ఆ పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. విశ్వసనీయ వర్గాలు ఇచ్చిన సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో జగన్ 20 నుంచి 25 మందికి అసలు టికెట్ లు ఇచ్చే ఛాన్స్ లేదు అని చెపుతున్నారు. అంటే ఇప్పుడు వైసీపీ నుంచి గెలిచినా 151 మందిలో ఈ మేరకు కోత పడనుంది. ఇది ఒకటి అయితే మరో నలభై నుంచి ఏభై చోట్ల అభ్యర్థులకు స్దాన చలనం ఉంటుంది అని వైసీపీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.ఇప్పటికే జగన్ ఈ మార్పులకు శ్రీకారం చుట్టారు కూడా. రాబోయే రోజుల్లో ప్రధానంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలే లక్ష్యంగా ఈ మార్పులు చేసే అవకాశం ఉంది అని చెపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు ప్రభావం ఎక్కువగా ఈ జిల్లాల్లో ఉండే అవకాశం ఉండటంతో జగన్ కూడా ఈ కోణంలోనే ఇక్కడ మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వైసీపీ వర్గాలు చెపుతున్నాయి. పొత్తు వల్ల పార్టీకి నష్టం జరగకుండా ఇతర సామాజిక వర్గాలను దగ్గర చేసుకునే వ్యూహంలో భాగంగానే జగన్ ఈ మార్పులు తలపెట్టారు అని ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అయితే ఈ ప్రయోగం రాజకీయంగా ఉపయోగపడుతుందా లేక ప్రత్యర్థి పార్టీలకు వరంగా మారుతుందా అనే సందేహాలు వైసీపీ నేతల్లో లేకపోలేదు. టికెట్స్ రాని వాళ్ళు పార్టీలో కొనసాగుతారా...ఇతర పార్టీల వైపు చూస్తారా అన్న సంగతి ఒకటి అయితే...కొత్తగా నియోజకవర్గాలు మారే వాళ్లకు కూడా ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఉన్న కీలక నేతలు పార్టీ పంపిన వారికి సహకరించటం అన్నది అంత సాఫీగా సాగే వ్యవహారం కాదు అని ఎక్కువ మంది చెపుతున్న మాట.

టీడీపీ, జనసేన పొత్తు ఆ పార్టీలకు ఒక సానుకూల అంశం అయితే...ఇప్పుడు కొత్తగా ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎంట్రీ కూడా టీపీడీ, జనసేన కూటమికి కొంతమేర ఉపయోగపడే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. ఈ కారణంగానే వైసీపీ మంత్రులు, పార్టీ నేతలు ప్రశాంత్ కిషోర్ ఇష్యూపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. వైసీపీ ఇప్పటికి ఐ ప్యాక్ సేవలు పొందుతున్న విషయం తెలిసిందే. ఆంధ్ర ప్రదేశ్ లోని జగన్ సర్కారు పై ఇప్పటికే వివిధ వర్గాల్లో వ్యతిరేకత ఉండటం ఒకటి అయితే...జగన్ టిక్కెట్ల విషయంలో చేస్తున్న మార్పులు కూడా పార్టీలో పెద్ద కుదుపులకు కారణం అయ్యే అవకాశం ఉంది అని చెపుతున్నారు. మంగళగిరి నియోజకవర్గానికి కొత్త ఇంచార్జి ని నియమిస్తున్నట్లు సమాచారం వచ్చిన వెంటనే సీఎం జగన్ కు ఎంతో సన్నిహితుడిగా పేరున్న ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఎమ్మెల్యే పదవితో పాటు వైసీపీ కి కూడా రాజీనామా చేసి షాక్ ఇచ్చారు. జగన్ అధికారికంగా తన నిర్ణయాలు ప్రకటించిన తర్వాత చాలా మంది ఇదే మార్గాన్ని ఎంచుకుంటారు అని చెపుతున్నారు. అయితే ఈ సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో చూడాల్సిందే. కారణాలు ఏమైనా అధికార పార్టీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు ఎన్నికలకు ముందే ఇతర పార్టీల్లో చేరితే అది ప్రజలు తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉంది అనే టెన్షన్ వైసీపీ నేతల్లో ఉంది.

Next Story
Share it