ఆయన తీరు అంతేనా!
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమికి ప్రధాన కారణం జగన్, ఆయన అనుచర గణం వ్యవహరించిన తీరే ప్రధానం అనే విమర్శలు ఉన్నాయి. సహజంగా మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళను వెంటనే కూర్చోమని చెపుతాం. మరీ ఎక్కువ మంది ఉంటే అందుకు అవసరమైన ప్లేస్ ఎక్కడ ఉందో వెతుకుతాం. ఈ ఫోటో చూస్తే ఇంతటి ఘోర పరాజయం తర్వాత కూడా జగన్ తీరులో మార్పేమీ వచ్చినట్లు లేదు అనే అభిప్రాయం కలగటం సహజం. జగన్ తన సీట్ లో కూర్చుని ఉంటే ...మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, రామసుబ్బారెడ్డి, మరొకరు ఆయనకు ఎదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. మిగిలిన వాళ్ళు అంతా ఏదో స్కూల్ పిల్లల తరహాలో చేతులు కట్టుకుని నిలుచుని ఉన్నారు.
ఇందులో మాజీ మంత్రులు...వయసులో జగన్ కంటే చాలా పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. జగన్ కూర్చుని ఉన్న రూమ్ చిన్నగా ఉంటే...తాడేపల్లి నివాసంలో , క్యాంపు ఆఫీసులో ఇంతమంది పట్టే ప్లేస్ కూడా లేదా...వాళ్ళను కూర్చోమని చెప్పకపోయినా ఏమి కాదులే అని జగన్ అనుకున్నారా?. ఈ ఫోటో చూసిన వాళ్లకు ఎవరికైనా ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అర్ధం చేసుకునే పరిస్థితిలో కూడా జగన్ లేరా..లేక ఆయన సహజ ధోరణే అదా అన్న అనుమానం రాక మానదు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఇంత దారుణ ఓటమి తర్వాత కూడా జగన్ ఏమి మారినట్లు లేరు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.