Telugu Gateway
Andhra Pradesh

ప్రతిపక్ష హోదా కోసం హై కోర్టు కు

ప్రతిపక్ష హోదా కోసం హై కోర్టు కు
X

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరు విచిత్రం గా ఉంది. ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో రాష్ట్రానికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా కోసం కూడా ఎప్పుడూ ఇంత సీరియస్ గా పోరాడిన దాఖలాలు లేవు. కానీ ఆయన ఇప్పుడు మాత్రం అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా కోసం తెగ పోరాడుతున్నారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వటం ఎంత అవసరమో...ఆ హోదా ఉంటేనే సభలో తాము ప్రజా సమస్యలపై గట్టిగా పోరాడగలుగుతామని అంటూ కొద్ది రోజుల క్రితం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యేన్నపాత్రుడికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖ అప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఇప్పుడు జగన్ వెరైటీ గా తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా చూడాలి అంటూ ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు. ఇందులో ఆయన అసెంబ్లీ కార్యదర్శి, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి తదితరులను ప్రతివాదులుగా చేశారు. గత ఐదేళ్ల కాలం లో జగన్ పాలన చూసిన తర్వాత ప్రజలు వైసీపీ కి మొన్నటి ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు. ఏ చట్ట సభలో అయిన మొత్తం సీట్లలో పదో వంతు సీట్లు దక్కించుకున్న పార్టీ నేతకే ప్రతిపక్ష హోదా ఇస్తున్నారు.

ఇది ఎప్పటి నుంచో అమలులో ఉంది. ఎక్కడ వరకు ఎందుకు వైసీపీ కి మండలి లో తాజాగానే ఆ పార్టీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డికి ప్రతిపక్ష నేత హోదా ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక్కడ అధికార టీడీపీ కి ఇష్టం ఉందా లేదా అన్న విషయంతో సంబంధము లేకుండా ఇది వచ్చేసింది. జగన్ డిమాండ్ చేస్తున్నట్లు అసెంబ్లీ లో కూడా ఆయనకు 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు. కానీ జగన్ మాత్రం ఈ విషయంలో మొండి వాదనలు చేస్తూ పరువు పోగొట్టుకుంటున్నారు అనే చర్చ వైసీపీ వర్గాల్లో కూడా ఉంది. మొన్నటి వరకు లోక్ సభలో సరిపడినంత మంది సభ్యులు లేరు అనే కారణంతో కాంగ్రెస్ కు మొన్నటి వరకు లోక్ సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వని విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు గెలుచుకోవటంతో రాహుల్ గాంధీ లోక్ సభ లో ప్రతిపక్ష నేత దక్కించుకోగలిగారు. అవసరమైన మేర సభ్యులు లేకపోయినా కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ కొంత మంది గత సుప్రీం కోర్టు ను ఆశ్రయించగా వాళ్లకు నిరాశే మిగిలింది. ఇప్పుడు జగన్ విషయంలో హై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it