Telugu Gateway
Andhra Pradesh

కేంద్రంలో అధికార భాగస్వామ్య విషయం మర్చిపోయారా?

కేంద్రంలో అధికార భాగస్వామ్య విషయం మర్చిపోయారా?
X

ఐటి..ఈడీ కేంద్ర అధీనంలో పని చేస్తాయనే విషయం అందరికి తెలిసిందే. ఈ రెండు సంస్థలు ఇప్పుడు ప్రధాని మోడీ ఏమి చెపితే అదే చేస్తున్నాయని..ముఖ్యంగా ప్రతిపక్షాల టార్గెట్ గా అవి పని చేస్తున్నాయని గత కొంత కాలంగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో చాలా వరకు వాస్తవం ఉంది అని నమ్మే వాళ్ళు కూడా ఎక్కువగానే ఉంటారు. కేంద్రంలోని మోడీ సర్కారు లో తెలుగు దేశం పార్టీ భాగస్వామిగా ఉంది. ఆ పార్టీ నుంచి రామ్ మోహన్ నాయుడు తో పాటు పెమ్మసాని చంద్ర శేఖర్ కూడా కేంద్ర మంత్రి గా ఉన్నారు. అంతే కాదు..ఆంధ్ర ప్రదేశ్ కేబినెట్ లో బీజేపీ ఎమ్మెల్యే సత్య కుమార్ మంత్రిగా ఉన్నారు. అటు కేంద్రంలో..ఇటు రాష్ట్రంలో రెండు చోట్ల ప్రభుత్వాల్లో భాగస్వామిగా ఉన్న టీడీపీ కి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఇటీవల తన చెల్లికి ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పినా కూడా ఐటి,ఈడీ ఎందుకు స్పందించటం లేదు అని ప్రశ్నించారు. జగన్ కు అసలు రెండు వందల కోట్ల రూపాయలు ఎక్కడ నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. అదే సమయంలో ఒక ఆర్థిక నేరస్థుడు పదకొండు సంవత్సరాలు బెయిల్ పై ఉండటం ఏంటి అని యనమల ప్రశించారు. ఇవ్వాళ కాకపోయినా రేపు అయినా జగన్ జైలు కు వెళ్ళటం ఖాయం అన్నారు. పాత కేసులతో పాటు జగన్ పై కొత్త కేసు లు కూడా సిద్ధం అవుతున్నాయని వ్యాఖ్యానించారు. జగన్ చేయి పట్టుకున్నల్లో అంతా పాతాళానికి వెళతారు అన్నారు. జగన్, షర్మిల మధ్య సాగుతున్నది ఆస్తుల వివాదం కాదు అని...ఇది రాజకీయంగా జగన్ ఆత్మహత్య అన్నారు. చివరకు జగన్ సొంత తల్లి, చెల్లిని కూడా మోసం చేశారు అని విమర్శించారు.

Next Story
Share it