Telugu Gateway
Andhra Pradesh

వాడుకుని వ‌దిలేయ‌టంలో జ‌గ‌న్ మాస్ట‌ర్

వాడుకుని వ‌దిలేయ‌టంలో జ‌గ‌న్ మాస్ట‌ర్
X

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిపై తెలుగుదేశం సీనియ‌ర్ నేత యనమల రామకృష్ణుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న‌కు అవ‌స‌రం ఉన్నంత‌వ‌ర‌కే ఎవ‌రినైనా అన్నా అన్నా అంటార‌ని..త‌ర్వాత అంతే సంగ‌తులు అని ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ఉద్యోగులను వాడుకొని వదిలేయడంలో సీఎం జగన్‌ను మించిన వారు లేరని పేర్కొన్నారు. జగన్మోహ‌న్ రెడ్డి వ్యవహారశైలిని , నైజాన్ని ఉద్యోగులు, పోలీసులు అర్థం చేసుకోవాలని కోరారు.మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో యనమల మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నాయకులు అక్రమంగా అరెస్టు చేయించేందుకు గౌతమ్‌ సవాంగ్‌ను వాడుకున్న సీఎం ఇప్పుడు అవమానకర రీతిలో సాగనంపారన్నారు. డీజీపీ స్థాయి వ్యక్తికి పోస్టింగ్‌ ఇవ్వకపోవడం అవమానించడమే అన్నారు.

ఎల్వీ సుబ్రహ్మణ్యం, పీవీ రమేష్‌, అజరు కల్లాంల పట్ల ఇదే విధంగా వ్యవహరించారన్నారు. చీకటి జీవోల ఆధ్యుడు ప్రవీణ్‌ప్రకాష్‌ను ఆకస్మికంగా ఢిల్లీ పంపేశారని యనమల విమ‌ర్శించారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని స్థితిలో రాష్ట్రం వుందని...ఉద్యోగులకిచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని అన్నారు. . జగ‌న్మోహ‌న్ రెడ్డి దుబారా, లూటీతో రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసిందని రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. కరోనాను బూచిగా చూపించి ఎడాపెడా అప్పులు చేస్తున్నారని... రాష్ట్రంలో ఆర్ధిక సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని యనమల కోరారు. రాష్ట్రంలో ఆర్ధిక ఎమర్జెన్సీ విధించాలని రామకృష్ణుడు డిమాండ్ చేశారు.

Next Story
Share it