Telugu Gateway
Andhra Pradesh

దమ్ముంటే వైసీపీ ఎన్నికలకు సిద్ధం కావాలి

దమ్ముంటే వైసీపీ ఎన్నికలకు సిద్ధం కావాలి
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం హాట్ హాట్ గా మారుతోంది. అధికార పార్టీ ఇప్పుడు ఎన్నికలకు అనువైన సమయం కాదని చెబుతుంటే..ప్రతిపక్ష టీడీపీ మాత్రం దమ్ముంటే ఎన్నికలు నిర్వహించండి అని ఛాలెంజ్ విసురుతోంది. ఈ అంశంపై మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు స్పందించారు. ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఉన్నప్పుడు సీఎస్ జోక్యం అనవసరం అని ఆయన తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అవసరం లేదని సిఎస్ సూచించడం అనుచితం. ఎస్ఈసి కోరినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల సంఘానికి బదిలీ చేయాల్సిన బాధ్యత రాజ్యాంగాధినేతగా రాష్ట్రంలో గవర్నర్ దేనని, ఆర్టికల్ 243కె(3) నిర్దేశిస్తోందని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. గవర్నర్ కూడా ఎన్నికల సంఘానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి స్థానిక ఎన్నికల నిర్వహణకు సహకరించాలి. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలి. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా పూర్తయ్యేలా చూడాలన్నారు. 'స్థానిక ఎన్నికలంటే వైసిపి ఎందుకు భయపడుతోంది..? తమ అఘాయిత్యాలు, అరాచకాలపై ప్రజలు వ్యతిరేక తీర్పు ఇస్తారనేదే వైసిపి భయం.

వైసిపి దాడులు- దౌర్జన్యాలు, కూల్చివేతలు-విధ్వంసం, హత్యలు-ఆత్మహత్యలు, అత్యాచారాలు-అవినీతి కుంభకోణాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. బాధిత కుటుంబాలన్నీ వ్యతిరేకంగా ఓటేస్తారనే భయం వైసిపి నాయకుల్లో కనిపిస్తోంది.నంద్యాలలో అబ్దుల్ సత్తార్ కుటుంబం సామూహిక ఆత్మహత్యలు, రాజమండ్రిలో అబ్దుల్ సత్తార్ ఆత్మహత్యా యత్నం, పల్నాడులో వందకు పైగా ముస్లిం కుటుంబాల వెలి, దాచేపల్లిలో ముస్లిం చిన్నారిపై అత్యాచారం...మైనారిటీలు ఓటేయరనే భయం వైసిపిలో ఉంది. ఎన్నికలు జరిగిన అమెరికాలో, శ్రీలంక, సౌత్ కొరియా, సింగపూర్, తదితర దేశాల్లో కరోనా లేదా..? బీహార్ ఎన్నికలకు కరోనా అడ్డం అయ్యిందా..? దుబ్బాక ఉప ఎన్నికకు కరోనా అడ్డం అయ్యిందా..? జిహెచ్ ఎంసికి ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కూడా వస్తోంది. కేంద్రానికి, ఇతర రాష్ట్రాలకు లేని కరోనా సాకులు వైసిపినే ఎందుకు చెబుతోంది..? ఊరంతా ఒకదారి అయితే ఉలిపికట్టెదో దారి..దేశం అంతా ఒకదారి అయితే, జగన్ రెడ్డిది ఇంకోదారి.. భయంతోనే వైసిపి స్థానిక ఎన్నికలకు వెనుకంజ వేస్తోంది. నిష్ఫాక్షికంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనేదే వైసిపి భయం. ఈసి వద్ద సమావేశానికి కూడా ఆ భయంతోనే వైసిపి గైర్హాజరు. ఓటమి భయంతోనే ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలంటే వైసిపి వెన్నులో వణుకు.' అని ఆరోపించారు.

Next Story
Share it