జగన్ ను ఆశీర్వదించి పంపిన విజయమ్మ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వై ఎస్ ఫ్యామిలీ లో ఒంటరి అయ్యారా?. అంటే అవుననే సమాధానం వస్తోంది. బుధవారం నాడు ఇడుపులపాయలో చోటు చేసుకున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా ఇదే అనుమానం రాక మానదు. అసెంబ్లీ ఎన్నికల కోసం జగన్ బుధవారం నించి మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇడుపులపాయ దగ్గర నుంచి ఇచ్చాపురం వరకు ఈ యాత్ర సాగనుంది. 21 రోజుల పాటు ఇది సాగుతుంది. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ఇడుపులపాయలో వై ఎస్ సమాధి వద్ద జగన్ నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలతో పాటు జగన్ తల్లి వైఎస్ విజయమ్మ కూడా పాల్గొన్నారు. అదే సమయంలో అత్యంత కీలకమైన రాజకీయ యాత్రకు శ్రీకారం చుడుతున్న జగన్ ను ఆశీర్వదించి పంపారు విజయమ్మ. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జగన్ పై తిరుగుబాటు జెండా ఎగరేసిన షర్మిల కు విజయమ్మ అండదండలు ఉన్నట్లు ఇంతకాలం ప్రచారం జరుగుతూ వచ్చింది. షర్మిల ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్న, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
ప్రతిపక్ష టీడీపీ, జనసేన ల కంటే షర్మిల చేసే విమర్శలే అటు జగన్ ను..ఇటు వైసీపీ ని ఇరకాటంలోకి నెట్టిన సందర్బాలు ఎన్నో. దివంగత రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక అయిన రాహుల్ గాంధీ ని ప్రధాని చేయటం అనే లక్ష్యం కోసమే తాను పని చేయనున్నట్లు షర్మిల ప్రకటిస్తున్నారు. మరో వైపు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా పైనే పెడతారు అని షర్మిల చెపుతూ వస్తున్నారు. కేంద్రం మెడలు వంచి హోదా సాదిస్తానన్న జగన్ మాటలు ఏమీ అయ్యాయి...అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా దీనికోసం సిన్సియర్ గా పని చేశారా అంటూ షర్మిల ఎటాక్ చేస్తున్న విషాయం తెలిసిందే. కారణాలు ఏమైనా కానీ వైసీపీ అధినేత, సీఎం జగన్ ను విజయమ్మ ఆశీర్వదించి పంపటంతో ఆమె షర్మిల వైపు కాదు జగన్ వైపే ఉన్నారు అనే విషయం స్పష్టం అయింది వైసీపీ వర్గాలు చెపుతున్నాయి. ఇది పార్టీ నేతలకు, క్యాడర్ కు కూడా ఒక సందేశం పంపినట్లు అయిందే అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.