Telugu Gateway
Andhra Pradesh

జగన్ అభ్యర్ధికి వ్యతిరేకంగా పిలుపు

జగన్ అభ్యర్ధికి వ్యతిరేకంగా పిలుపు
X

కడప లోక్ సభ ఎన్నికలకు సంబంధించి శనివారం నాడు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ నుంచి కడప ఎంపీగా పోటీ చేస్తున్న వై ఎస్ షర్మిల కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రచారం నిర్వహించారు. ఆమెను ఎంపీగా గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎవరూ ఊహించని రీతిలో వై ఎస్ షర్మిల కోసం విజయమ్మ ఒక వీడియో విడుదల చేశారు. రాజశేఖర్ రెడ్డి ని అభిమానించే వాళ్ళు...ఆయన్ను ప్రేమించే వాళ్లకు..కడప లోక్ సభ నియోజకవర్గ ప్రజలందరికి విన్నపం. వైఎస్ ముద్దుబిడ్డ వై ఎస్ షర్మిల లోక్ సభకు పోటీ చేస్తోంది. ఆమెను ఆశీర్వదించి..పార్లమెంట్ కు పంపమని మిమ్మలను అందరిని ప్రార్థిస్తున్నా. గతంలో వై ఎస్ ను ఎలా ఆదరించారో..అక్కున చేర్చుకున్నారో అలాగే షర్మిలను కూడా ఆదరించాలి అన్నారు. అంటే కడప లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ తరపున జగన్ నిలబెట్టిన అభ్యర్థి వై ఎస్ అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే ఇది ఖచ్చితంగా జగన్ షాక్ అనే చెప్పాలి.

ఒక వైపు జగన్, మరో వైపు షర్మిల. ఎవరికీ అండగా నిలబడాలో తెలియక అత్యంత కీలకమైన ఎన్నికల వేళ విజయమ్మ అమెరికా వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారం మరికొద్ది గంటల్లో ముగియనుంది అనగా షర్మిల ను గెలిపించాలని కోరుతూ వీడియో విడుదల చేసి తాను షర్మిల పక్కన ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ప్రధానంగా ఈ ఎన్నికల సమయంలో వై ఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి కే జగన్ సీట్ ఇచ్చిన విషయం తెలిసిందే. హత్య కేసు లో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి కి సీటు ఇవ్వడంపై ఒక వైపు సునీత, మరో వైపు షర్మిల లు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. నిందితులను శిక్షించే చర్యలు చేపట్టకుండా ..వాళ్ళను కాపాడుతున్నారు అంటూ వీళ్లిద్దరు జగన్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో విజయమ్మ వీడియో పెద్ద సంచలనం అనే చెప్పాలి.

Next Story
Share it