ఆళ్ల రామకృష్ణ రెడ్డి ప్రకటనతో పిక్చర్ క్లియర్ !
కొడుకు పెళ్లి తర్వాత పూర్తి స్థాయి రాజకీయాలపై ఫోకస్
ఫ్యామిలీ ఫైట్ కాస్తా పొలిటికల్ ఫైట్ గా మారబోతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఖరారు కావటంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రాబోయో రోజుల్లో కొత్త కొత్త మలుపులు తిరగటం ఖాయంగా కనిపిస్తోంది. షర్మిల ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు చేపట్టనున్న విషయం ఖరారు అయినందునే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. తాను షర్మిలతో కలిసి ముందుకు సాగుతానని...ఆమె వెంటే నడుస్తానని వెల్లడించారు. షర్మిల తో మాట్లాకుండా రామకృష్ణ రెడ్డి ఇంతటి కీలక ప్రకటన చేసే అవకాశం లేదు. ఒక్క ఆళ్ల రామకృష్ణ రెడ్డి మాత్రమే కాదు...వైసీపీ లో టికెట్ రాని వారు , తెలుగు దేశం, జనసేనలో చేరే ఛాన్స్ లేని వాళ్ళు అందరూ షర్మిల కాంగ్రెస్ లో చేరిన తర్వాత అటు వైపు వెళ్లే అవకాశం ఉంది. ఈ విషయంలో ఇప్పటికే ఎవరి పనిలో వాళ్ళు ఉన్నట్లు చెపుతున్నారు. గత ఎన్నికల్లో అన్న కోసం ప్రచారం చేసిన వై ఎస్ షర్మిల ఈ సారి మాత్రం వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా ఆంధ్ర ప్రదేశ్ లో విస్తృతంగా ప్రచారం చేయబోతున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లో కొడుకు పెళ్లి పూర్తి అయిన తర్వాత షర్మిల ఏపీపై పూర్తి స్థాయిలో దృష్టిసారించనున్నారు.
జగన్ ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎటాక్ చేస్తున్నారు...షర్మిల ఎంట్రీ ఇచ్చిన తర్వాత జగన్ ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పుడు కీలకం కానుంది. ప్రచారం జరుగుతున్నట్లు షర్మిల పీసిసి పదవి కాకుండా స్టార్ క్యాంపెయినర్ పదవి తీసుకుని ఆ పార్టీ తరపున ప్రచారం చేస్తారని చెపుతున్నారు. దీంతో పాటు ఏఐసిసి లో ప్రధాన కార్యదర్శి పదవి కూడా ఇచ్చే అవకాశం ఉంది అని కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి. త్వరలోనే కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లు ఏపీలో నిర్వహించే బహిరంగ సభల్లో కూడా పాల్గొంటారు అని...వీటిని విజయవాడ, వైజాగ్ లో నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేశాయి. ప్రత్యేక హోదా తో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్, రాజధాని అమరావతి అంశాలు టార్గెట్ గా ప్రచారం చేయాలని కూడా పార్టీ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఓటు బ్యాంకు పెంచుకోవటంపైనే ఫోకస్ పెట్టనుంది. దీనికి వైఎస్ షర్మిల ప్రచారం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని కాంగ్రెస్ అధిష్టానం నమ్ముతోంది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లు షర్మిల కు కర్ణాటక నుంచి రాజ్య సభకు పంపించటం కూడా ఖాయం అయింది ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.