Telugu Gateway
Andhra Pradesh

ఇదే అస్త్రంగా ఏపీ కాంగ్రెస్ ప్లాన్స్

ఇదే అస్త్రంగా ఏపీ కాంగ్రెస్ ప్లాన్స్
X

వైసీపీ కి సమస్య ఓటు బ్యాంకు కాదు... వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే. ఇది ఇప్పుడు కొంత మంది సీనియర్ వైసీపీ నాయకులు చెపుతున్న మాట ఇది . పాలన చూడక ముందు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వేరు. ఆయన ఐదేళ్ల పాలన చూసిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి వేరు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు కూడా జగన్ ఏంటో క్లారిటీ వచ్చేసింది. అధికారంలో ఉన్న ఐదేళ్లు జగన్ మోహన్ రెడ్డి మంత్రులను పెద్దగా పట్టించుకోలేదు...ఎమ్మెల్యేల సంగతి అయితే ఇక చెప్పాల్సిన పనే లేదు. మంత్రులు, ఎమ్మెల్యేల సంగతి కాసేపు పక్కన పెట్టినా కూడా ఎవరి పేరు మీద అయితే పార్టీ పెట్టారో....ఎవరి ఇమేజ్ తో జగన్ రాజకీయాల్లోకి వచ్చారో అలాంటి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు లేకుండా జగన్ చేసిన ఎన్నికల ప్రచారం వైసీపీలో కొంతమంది సీనియర్ నేతలకు ఏ మాత్రం రుచించటం లేదు. ఎన్నికలకు ముందు ఇండియా టుడే ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో జగన్ మోహన్ రెడ్డి కేవలం తన పేరు మీదే ఓట్లు అడుగుతాను అని తేల్చి చెప్పారు. మంత్రులు..ఎమ్మెల్యేలు ఎవరి గురించి ఉండదు అన్నారు. సరే కాసేపు జగన్ మోడల్ అదే అనుకుందాం. కానీ రాజకీయంగా వై ఎస్ వారసుడుగా చెప్పుకునే జగన్ మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఎక్కడా కూడా ఎన్నికల ప్రచార సమయంలో తన తండ్రి వై ఎస్ ఆర్ పేరును కూడా ప్రస్తావించలేదు.

తాను మంచి చేసి ఉంటే...తన పాలనతో ప్రతి ఇంటికి మేలు జరిగి ఉంటేనే తనకు ఓట్లు వేయాలని కోరారు. అసలు వైసీపీ కి అంత ఓటు బ్యాంకు వచ్చింది అంటే అది వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ వల్ల అనే సంగతి ప్రతిఒక్కరికి తెలిసిందే. కొన్ని పథకాలకు వైఎస్ ఆర్ పేరు పెట్టినా కూడా వాటిని డామినేట్ చేసేలా గత ఐదేళ్ల కాలం లో పెద్ద ఎత్తున ప్రతి స్కీం కు ముందు జగనన్న పేరును తగిలించిన విషయం తెలిసిందే. దీంతో వై ఎస్ కంటే జగన్ పేరు మీదే ఎక్కువ ప్రచారం జరిగింది. సొంత తండ్రి విషయంలో జగన్ వ్యవరించిన తీరు వైసీపీ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇవే అస్త్రాలుగా ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్న వై ఎస్ షర్మిల వైసీపీ నాయకులు, క్యాడర్ ను టార్గెట్ చేసుకునే దిశగా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. అందులో భాగంగానే విజయవాడలో వైఎస్ 75 వ జయంతిని అట్టహాసంగా నిర్వహించిన విషయం తెల్సిందే. ఇది అంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే జరిగింది అనే చర్చ సాగుతోంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో వైసీపీ కి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. వైసీపీ లోకి వచ్చిన వాళ్లలో ఎక్కువ మంది కాంగ్రెస్ వాళ్లే కావటంతో ఇది వాళ్లకు పెద్ద సమస్య కూడా కాదు .

ఇక్కడ మరో ప్రధాన అంశం ఏమిటి అంటే ఇంతటి దారుణం పరాభవం తర్వాత కూడా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి లో ఎక్కడా కూడా మార్పు వచ్చిన సూచనలు కూడా కనిపించటం లేదు అని...ఇది రాజకీయంగా తమకు నష్టం చేస్తుంది అనే ఆలోచనలో ఎక్కువ మంది నేతలు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఎన్నికల తర్వాత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి వరసగా చేస్తున్న ప్రకటనలు ఆ పార్టీ నేతల్లో కలకలం రేపుతున్నాయి. ఫలితాలు వచ్చిన వెంటనే ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేసిన జగన్ తర్వాత చంద్రబాబు నాయుడు ఇచ్చిన మోసపూరిత హామీల వల్లే కూటమి గెలిచింది అంటూ ప్రకటించారు. జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జైలు లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో సమావేశం అయిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత వైసీపీ నాయకులు కూడా షాక్ కు గురి అయ్యారు అనే చెప్పాలి. ఎక్కడా వైఎస్ఆర్ పేరు ప్రస్తావించకుండా మొన్నటి ఎన్నికల్లో పూర్తిగా తన సొంత ఇమేజ్ తోనే గెలిచి.. వై ఎస్ కంటే తానే ఎక్కువ పేదలకు మేలు చేసిన ముఖ్యమంత్రిగా ముద్ర వేయించుకోవాలని జగన్ చేసిన ప్రయత్నాలు ఘోరంగా ఫెయిల్ అయ్యాయి. ఇది ఒక్కటే జగన్ ఓటమికి కారణం కాకపోయినా ఇది కూడా ఒక కీలక అంశంగా మారింది అని వైసీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it