గత ఎన్నికల జగన్ అస్త్రాలే..ఇప్పుడు షర్మిల ఆయుధాలు
జగన్ చివరకు సొంత ఎమ్మెల్యేలను కూడా కలిసే పరిస్థితి లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకోవటం కాదు..పని తీరులో కూడా అది కనపడాలి అన్నారు. కాంగ్రెస్ లో చేరేటప్పుడే తనను టార్గెట్ చేస్తారు...విమర్శిస్తారు అని తెలుసన్నారు. ఎంతో మంది ఆస్తులు అమ్ముకుని త్యాగాలు చేస్తే జగన్ సీఎం అయ్యారు అని...తర్వాత వాళ్ళందరిని పక్కన పెట్టారు అని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రమే కాదు...అయన ఎమ్మెల్యేలు..ఎంపీలు అందరూ బీజేపీ కి బానిసలుగా మారారు అన్నారు. రాష్ట్రాన్ని కూడా బీజేపీ కి బానిసగా చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ సీఎం అయిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కు ఎంతో కీలకం అయిన స్పెషల్ స్టేటస్ ఊసే లేకుండా పోయింది అని..పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎప్పుడూ నిలదీసింది లేదు. కనీసం మాట్లాడింది లేదు. రాజధాని కడతామన్నారు. మూడు రాజధానులు అంటూ కన్ ఫ్యూజ్ చేసి..కనీసం ఇప్పుడు రాజధాని ఏంటో కూడా తెలియని పరిస్థితి కల్పించారు అంటూ మండిపడ్డారు. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు వైసీపీ కి ఒక పెద్ద సవాల్ గా మారితే..ఇప్పుడు వై ఎస్ షర్మిల ఎటాక్ జగన్ మోహన్ రెడ్డి ని..వైసీపీ ని మరింత చిక్కుల్లో పడేయటం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో జగన్ వేటిని అయితే ప్రధాన అస్త్రాలుగా చేసుకుని ఎన్నికలకు వెళ్లారో వాటినే షర్మిల ఇప్పుడు తన అస్త్రాలుగా మార్చుకున్నారు. అందులో అత్యంత కీలకం అయింది ప్రత్యేక హోదా అయితే..రెండవది పోలవరం ప్రాజెక్ట్. ఈ రెండింటి విషయంలో జగన్ సర్కార్ సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఉండనే చెప్పొచ్చు. రాజధాని గందరగోళం కూడా జగన్ కు మైనస్ అయ్యే అంశాల్లో ఒకటిగా ఉండే అవకాశం ఉంది.