రాఖీ రోజు అన్న కు ఝలక్ !
వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి వచ్చే ఎన్నికల్లో కొత్త తిప్పలు తప్పేలా లేవు. ఇప్పటికే టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తాయనే అంచనాలు ఉన్న వేళ మరో వైపు వై ఎస్ షర్మిల రూపంలో జగన్ కు కొత్త సవాల్ ఎదురుకాబోతున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ, జనసేన కలిస్తే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది అనే భయంతోనే సీఎం జగన్ దగ్గరనుంచి వైసీపీ మంత్రులు..ఆ పార్టీ నేతలు అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. చాలా సార్లు హద్దులు దాటి మరీ వీళ్లపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. దీనికంతటికి కారణం ఈ రెండు పార్టీల మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా పొత్తు పొడిస్తే వైసీపీ గెలుపు కష్టం అనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఎలాగైనా సరే దీన్ని బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో అధికార పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. ఈ సమస్య ఇలా ఉండగానే వైసీపీ అధినేత, సీఎం జగన్ చెల్లి వై ఎస్ షర్మిల గురువారం నాడు ఢిల్లీలో సోనియా గాంధీతో భేటీ అవటం జగన్ కు ఏ మాత్రం మింగుడు పడని అంశమే అని చెప్పొచ్చు. కాంగ్రెస్ అంటే జగన్ ఒంటి కాలిపై లెగుస్తున్న తరుణంలో అయన చెల్లి కాంగ్రెస్ లో చేరి అది కూడా నేరుగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం ఉన్న వేళ ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార పార్టీ ని ఉక్కిరిబిక్కిరి చేసే అంశమే.
గత ఎన్నికల్లో జగన్ గెలుపు కోసం షర్మిల తన వంతు ప్రయత్నం చేశారు. కారణాలు ఏమైనా జగన్ తర్వాత షర్మిలను దూరం పెట్టడంతో ఆమె తెలంగాణ లో పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆంధ్ర ప్రదేశ్ లో ఆమె కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. అదే జరిగితే జగన్ కు మరింత కష్టాలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే జగన్ పాలనపై వివిధ వరంగల్లో అసంతృప్తి పెద్ద ఎత్తున ఉంది. అదే సమయంలో తాను అధికారంలోకి వస్తే చాలు ఆంధ్ర ప్రదేశ్ కు అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా పరుగులు పెట్టుకుంటూ వస్తుంది...పోలవరం పూర్తి అవుతుంది...విభజన హామీలు అలా అమలు అవుతాయి అంటూ జగన్ అప్పటిలో అందరిని నమ్మించారు. కానీ ఇందులో ఏది ఆచరణకు నోచుకోలేదు. మరో వైపు తొలుత అంగీకరించిన రాజధాని అమరావతి కి హ్యాండ్ ఇచ్చి..మూడు రాజధానులు అంటూ కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి మొత్తం రాజధాని అంశాన్ని గందరగోళంలో పడేశారు జగన్. ఒక వైపు రాజకీయ సవాళ్లు, మరో వైపు గతంలో చెప్పిన మాటలకు బిన్నంగా వ్యవహరించి జగన్ తన ఇమేజ్ ను తానే దెబ్బ తీసుకున్నారు అనే అభిప్రాయం వైసీపీ నేతల్లో కూడా ఉంది. షర్మిల పార్టీ విలీనం అంతా సాఫీగా పూర్తి అయితే ఇందుకు గాను ఆమెకు కర్ణాటక నుంచి రాజ్య సభ సీటు ఇచ్చే అవకాశం ఉంది అనే ప్రచారం బలంగా ఉంది.