జగన్ చెప్పింది చేశారా?
సీఎం జగన్ మూడు రాజధానులు అని...ఇప్పటి వరకు ఒక్కటి కూడా కట్టలేదు అని...రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు అని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్ అప్పులు పది లక్షల కోట్లకు చేరినా కూడా రాష్ట్రంలో అభివృద్ధి జీరో అన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన వెంటనే షర్మిల తన అన్న, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై విమర్శలు చేయటంపై ఏ మాత్రం సంశయించలేదు. దీంతో రాబోయే రోజుల్లో..అంటే ఎన్నికల సమయంలో వైసీపీ, టీడీపీ విషయంలో తన స్టాండ్ ఎలా ఉండబోతుందో స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది అనే చర్చ సాగుతోంది. అది కూడా జగన్ గతంలో చెప్పిన మాటలను తీసుకుని మరీ ఆమె విమర్శలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన చేసే విమర్శలను వైసీపీ గట్టిగా కౌంటర్ ఇస్తూ వస్తోంది. గత ఎన్నికల్లో జగన్ కోసం పనిచేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ తరపున వైసీపీ ని, జగన్ ను టార్గెట్ చేయటంతో కచ్చితంగా అధికార వైసీపీ ఇరకాటంలో పడటం ఖాయంగా కనిపిస్తోంది. ఇతర పార్టీలు చెప్పే వాటి కంటే ..ఇప్పుడు షర్మిల చేసే విమర్శలు అందరి దృష్టిని ఆకర్షించటంతో పాటు వైసీపీ కి సమాధానం చెప్పుకోలేని స్థితి కల్పిస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.