కూటమి సర్కారు విషయంలో సాఫ్ట్ కార్నర్!
దేశంలోనే కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో అయితే ఈ పరిస్థితి మరింత ఘోరం. వరస పరాజయాలతో కాంగ్రెస్ అధిష్టానం కూడా డైరెక్షన్ లెస్ గా సాగుతుంది అనే విమర్శలు ఉన్నాయి. గెలవని రాష్ట్రాలు ఎలాగూ గెలవటం లేదు...గెలిచిన రాష్ట్రాల్లో అయినా పరిపాలన సాఫీగా సాగేలా చూసుకుంటుందా అంటే అది కూడా లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. విభజన జరిగి పదేళ్లు దాటినందున ప్రజలు ఆ గాయాలను మర్చిపోయి కాంగ్రెస్ ను కొంత అయినా ఆదరిస్తారు అని భావించారు. ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ లో జోష్ నింపేందుకు అని దివంగత రాజశేఖర్ రెడ్డి కుమార్తె వై ఎస్ షర్మిల కు రాష్ట్ర పార్టీ సారధ్య బాధ్యతలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్ఠానం. 2024 జనవరి 16 న ఈ ప్రకటన వెలువడింది. జగన్ సీఎంగా ఉన్న సమయంలోనే ఆమె కు ఈ బాధ్యతలు అప్పగించటం వల్ల పార్టీ లో జోష్ వస్తుంది అని అధిష్టానం భావించింది. ముఖ్యంగా రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను ఉపయోగించుకుని షర్మిల ను ముందు పెట్టి లబ్ది పొందాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు వేసుకుంది.
కానీ లాభం సంగతి అటుంచి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి గతంలో ఉన్న దాని కంటే మరింత దారుణంగా మారింది అనే అభిప్రాయాన్ని కొంత మంది కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. వై ఎస్ షర్మిల అసలు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఏ మాత్రం దృష్టి సారిస్తున్న దాఖలాలు లేవు అని ఆ పార్టీ నాయకులే చెపుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం తర్వాత చాలా మంది వైసీపీ నేతలు కాంగ్రెస్ వైపు వెళతారు అని లెక్కలు వేశారు.జగన్ తీరు ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో మరింత కష్టం అవుతుంది అనే అభిప్రాయంతో కొంత మంది వైసీపీ నేతలు ఉన్న మాట వాస్తవం. ఎందుకంటే గత ఐదేళ్లలో తాను చేసింది అంతా కరెక్ట్ అని..చంద్రబాబు ఎక్కువ హామీలు ఇవ్వటం వల్లే ప్రజలు కూటమికి ఓటు వేశారు అనే అభిప్రాయంతోనే అయన ఇప్పటికి ఉన్నారు. కానీ అధికారంలో ఉన్న కాలంలో సర్వం తానే అని మంత్రులు అయినా, ఎమ్మెల్యేలను అయినా ఏపీ ప్రజలు తనను చూసి ఓటు వేశారు అనే భావనతోనే జగన్ ఉన్న విషయం తెలిసిందే.
అయితే వైసీపీ నేతలు కాంగ్రెస్ లోకి వెళ్ళటం సంగతి అటుంచి...అసలు షర్మిల ఇప్పటికే ఉన్న నేతలను పట్టించుకోకపోవటం..పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించటం వంటివి ఏ మాత్రం చేయటం లేదు అనేది ఎక్కువ మంది నేతలు చెపుతున్న మాట. ఈ కొత్త సంవత్సరంలో అంటే 2025 లో ఏపీ పీసిసి ప్రెసిడెంట్ ఉన్న షర్మిల ఒక్క జనవరి 26 న తప్ప పార్టీ ఆఫీస్ లో అడుగుపెట్టిన దాఖలాలు లేవు అని ఒక సీనియర్ నేత వెల్లడించారు. మరో వైపు షర్మిల కూటమి ప్రభుత్వంలో సాగుతున్న అక్రమాలపై కూడా ఏదో కంటితుడుపు ప్రకటనలు చేయటం మినహా ఎక్కడా కూడా సీరియస్ గా స్పందిస్తున్న దాఖలాలు లేవు అన్నది ఎక్కువ మంది నేతల అభిప్రాయం. దీంతో పాటు అధికారంలో ఉన్న కూటమి విషయంలో ఆమె సాఫ్ట్ కార్నర్ తో వ్యవహరిస్తున్నారు అనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో ఉంది.
ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు టీడీపీ సారథ్యంలోని కూటమి వర్సెస్ వైసీపీ ల మధ్యే తప్ప మరో పార్టీ లేదు. ఈ రెండు పార్టీ లకు బలాలతో పాటు బలహీనతలు కూడా చాలానే ఉన్నాయి. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ యాక్టీవ్ అయి ప్రజా సమస్యలపై ఫోకస్ చేస్తే రాజకీయంగా ఎంతో కొంత ఫలితం ఉండటం పక్కా అని...కానీ పీసిసి పదవి దక్కించుకున్న షర్మిల మాత్రం ఈ విషయంలో ఎక్కడా దూకుడు చూపించకుండా పార్టీ ని వదిలేశారు అనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగి దిద్దుబాటు చర్యలు చేపడితే వచ్చే ఎన్నికల నాటికి కనీసం కాంగ్రెస్ ఆంధ్ర ప్రదేశ్ ఉనికి చాటుకోవడానికి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది అన్నది కొంత మంది నేతల అభిప్రాయం.