Telugu Gateway
Andhra Pradesh

వైసీపీ ఎమ్మెల్యేలు...నేతలే మంచోళ్ళు అంటున్నారు

వైసీపీ ఎమ్మెల్యేలు...నేతలే మంచోళ్ళు అంటున్నారు
X

వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే ప్రజలు వైసీపీ నేతలు..ఎమ్మెల్యేలే మంచోళ్ళు అనే పరిస్థితి వచ్చింది అన్నారు. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్ లు...ఇసుక అక్రమ దందాలు..బెల్ట్ షాప్ లు నడుపుతూ ప్రజలను దోచుకుంటున్నారు అని ఆరోపించారు. అదే సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో ప్రభుత్వం దారుణంగా విఫలం అయినందున ...నేతలు..ఎమ్మెల్యేలు కూడా ప్రజల వద్దకు వెళ్లే పరిస్థితి లేదు అన్నారు. జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాడు విజయవాడ కార్పొరేటర్లు, ఇతర నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చేది వైసీపీ నే అని...ఈ సారి అధికారంలోకి వచ్చాక 30 ఏళ్ళు తామే అధికారంలో ఉంటామన్నారు.

ఎందుకంటే చంద్రబాబు హామీలతో మరో సారి ప్రజలు మోసపోతున్నందున ఆయన్ను మరో సారి నమ్మే అవకాశమే ఉండదు అని చెప్పారు. ఇదే జగన్ మోహన్ రెడ్డి తొలి సారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అదే వేదిక నుంచి తానే అధికారంలో 30 సంవత్సరాలు అధికారంలో ఉంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ ఐదేళ్లలోనే ఆయన్ను ప్రజలు ఏకంగా 151 నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. హామీల విషయంలో చంద్రబాబును నమ్మటం అంటే చంద్రముఖిని నెత్తిన పెట్టుకోవటమే అనే విషయం తాను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పానని..ఇప్పుడు అదే జరుగుతుంది అన్నారు. వచ్చేది మన ప్రభుత్వమే అంటూ జగన్ 2 . ఓ వేరే గా ఉంటుంది అన్నారు . జగన్ 1 . ఓ లో ప్రజలకు పథకాలు అమలు చేయాలనే ఉద్దేశంతో కార్యకర్తల విషయంలో కొంత పట్టించుకుని ఉండకపోవచ్చు అని.... వచ్చే సారి మాత్రం ఆలా ఉండదు అన్నారు.

మహా అయితే కేసులు పెడతారు. ఏమి అవుద్ది. మూడు నెలల్లో బయటకు వస్తాం. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్స్ ఉన్నాయి. నాకింత నీకింత మొదలైంది . మరో సారి చంద్రబాబు మోసాలు చూస్తున్నారు కాబట్టి ఈ సారి మనకు 30 ఏళ్ళు ఉండేలా ప్రజలు తీర్పు ఇస్తారు. కష్టాలు లేనిదే సుఖం రాదు. కష్టాలు ఎలా ఎదుర్కోవాలి అనేది తెలిసిన వాళ్లే లీడర్లు అవుతారు. కష్టాలు ఎల్లకాలం ఉండవు. ఎవరికీ ఏ కష్టం వచ్చినా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు జైలు లో వేశారు. రాజకీయంగా ఎదుగుతున్నా అని దొంగ కేసు లు పెట్టి వేధించారు. ఈ కేసులు వేసింది ఎవరో కాదు టీడీపీ, కాంగ్రెస్ వాళ్లే. కానీ ఏమైంది బయటకు రాలేదా...సీఎం కాలేదా. ఎవరికైనా ఇంతే. ఒక బాటిల్ లో నీళ్లు కింద పోస్తే మళ్ళీ ఎత్తుకోలేం. అలాగే ఒక్కసారి క్యారెక్టర్ కూడా పోతే మళ్ళీ తిరిగి పొందలేము. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలి అని పార్టీ నాయకులకు జగన్ సూచించారు.

Next Story
Share it