Telugu Gateway
Andhra Pradesh

ఫోటోలు కూడా విడుదల చేయలేనంత గ్యాపా?

ఫోటోలు కూడా విడుదల చేయలేనంత గ్యాపా?
X

ఆ భేటీ రహస్యం అయితే ఎలాంటి ఫోటో లు బయటకు రావు. పారిశ్రామిక వేత్తలు ..ఇతర ప్రముఖులను కలిసినప్పుడు ఇలాంటి విధానమే అనుసరిస్తారు. అవి అధికారిక సమావేశాలు కాదు కాబట్టి వాటి వివరాలు కూడా బయటకు చెప్పరు. ఇది అందరికి తెలిసిన విషయమే. కానీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వై ఎస్ షర్మిల తన కొడుకు పెళ్లికి పిలవటానికి తాడేపల్లి వస్తున్నారు అని ముందు రోజే అంటే బుధవారం నాడే మీడియాలో వార్తలు వచ్చాయి. మీడియా ఈ మొత్తం వ్యవహారాన్ని ప్రముఖంగా చూపించింది కూడా. ఎందుకంటే తెలంగాణ లో షర్మిల పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్, షర్మిల ఎక్కడ కలుసుకోలేదు. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే షర్మిల తాడేపల్లిలో జగన్ నివాసంలో సుమారు అర గంట ఉన్నారని వార్తలు వచ్చాయి. సమయం సంగతి కాసేపు పక్కన పెడితే వీళ్లిద్దరి భేటీకి సంబదించిన ఒక్క ఫోటో ను కూడా బయటకు రానివ్వలేదు. అటు వైఎస్ఆర్ సి పీ సోషల్ మీడియా పేజీల్లో కానీ...మరెక్కడా ఈ ఫోటో లు కనిపించలేదు. సహజంగా సీఎం ను కలిసే ప్రముఖుల ఫోటోలు తీయటం....వీటిని మీడియాకు విడుదల చేయటం సాధారణంగా జరిగే విషయం.

పెళ్లి కార్డు ఇచ్చే ఫోటో లో పెద్ద విషయాలు కూడా ఏమీ ఉండే ఛాన్స్ ఉండదు. కానీ సీఎం జగన్ ఆదేశాలతోనే ఇది జరిగి ఉంటుంది అని చెపుతున్నారు. పెళ్లి కార్డు ఇవ్వటం వ్యక్తిగత విషయం...దీనికి అధికారికంగా ఫోటో లు ఎందుకు అనే అభిప్రాయం కొంత మంది వ్యక్తం చేస్తుంటే...అంతా బాగున్న రోజుల్లో షర్మిల జగన్ కు రాఖీ కట్టిన ఫోటోలు విడుదల చేసిన విషయాన్ని మరికొంత మంది గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే కావాలనే షర్మిల తాడేపల్లి లో జగన్ ను కలిసిన ఫోటో లు బయటకు రాకుండా చూశారు అని చెపుతున్నారు. దీంతో అటు జగన్, షర్మిల మధ్య గ్యాప్ ఏ స్థాయిలో ఉందో అర్ధం అవుతుంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బుధవారం నాడు కాకినాడలో చివరకు కుటుంబాలను కూడా అడ్డగోలుగా చీలుస్తారు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు షర్మిల కాంగ్రెస్ లో చేరనున్న విషయంపైనే అనే చర్చ సాగుతోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరటం జగన్ కు ఏ మాత్రం ఇష్టంలేని వ్యవహారం అయితే...ఇది రాజకీయంగా ఆయనకు రాబోయే రోజుల్లో ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అంశంగా మారుతుంది అని చెపుతున్నారు. చివరకు జగన్ ఫ్యామిలీకి చెందిన సొంత పత్రిక సాక్షిలో కూడా ఎయిర్ పోర్ట్ లో షర్మిల ఫోటో వేశారు తప్ప సీఎం జగన్ తో భేటీ అయినా ఫోటో వేయలేదు అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.

Next Story
Share it