పార్టీ పెట్టాక తొలిసారి జగన్..షర్మిల ఒకే చోట
దివంగత రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలో గురువారం నాడు ఆయన సమాధి వద్ద వైఎస్ కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్, వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల, భారతి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జయంతి సందర్భంగా విడివిడిగా నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు ఈ సారి ఒకేసారి వెళ్ళటం విశేషం. జయంతి సందర్భంగా జగన్, షర్మిల విడివిడిగా వెళ్ళటంపై అప్పట్లో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి వివరణ కూడా ఇచ్చారు. షర్మిల తెలంగాణ లో పార్టీ పెట్టినందున ఆమె, జగన్ కలిసి వెళ్తే అనవసర విమర్శలకు తావివిచ్చినట్లు అవుతుందని..అందుకే ఉద్దేశపూర్వకంగానే విడివిడిగా వైఎస్ కు నివాళులు అర్పించారని చెప్పారు. అయితే ఈ సారి అందుకు భిన్నంగా జరగటం విశేషం.
గురువారం ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో కుటుంబ సభ్యులు అంతా పాల్గొన్నారు. వైఎస్ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ గురువారం ఉదయమే ఓ ట్వీట్ చేశారు. 'నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జన హృదయాల్లో కొలువై ఉన్నారు.చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ,చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది' అని పేర్కొన్నారు.