పార్టీ నేతల్లోనూ అనుమానాలు ఎన్నో
వైసీపీ ని గెలిపించేది ఎమ్మెల్యే లు, ఎంపీలు, పార్టీ కార్యకర్తలు కాదు...లబ్ధిదారులు అన్నట్లు వ్యవహరించారు జగన్. తానే ఒక బ్రాండ్..తన బ్రాండ్ తోనే గెలుస్తాం అన్నట్లు ధీమాగా వ్యవహరించారు. తనను తాను సింహంగా చెప్పుకునే జగన్ అధికారంలో ఉన్నంతకాలం లెక్కలేనంత మంది సలహాదారులను పెట్టుకున్నారు. ఇది అంతా కూడా ఏదో ఉపాధి హామీ పథకంగా సాగింది తప్ప...ఐదేళ్లలో జగన్ సలహాదారుల నుంచి పెద్దగా ఎక్కడా ఇన్ పుట్స్ తీసుకుని వాటిని అమలు చేసిన దాఖలాలు లేవనే చెప్పొచ్చు. అధికారంలో ఉన్నంత కాలంగా పార్టీ అంటే జగన్...జగన్ అంటే పార్టీ అన్నట్లు వ్యవహరించిన ఆయన ఇప్పుడు పార్టీ నిర్మాణం కోసం అంటూ ఆళ్ల మోహన్ సాయి దత్ ను సలహాదారుగా నియమించుకున్నారు. పార్టీ నిర్మాణంలో ఆయన అధ్యక్షుడికి సలహాదారుగా వ్యవహరిస్తారు అంటూ వైసీపీ ఇటీవల అధికారికంగా వెల్లడించింది. తాను అనుకున్నది తప్ప ఎవరి మాట వినని జగన్ కు ఎంత మంది సలహారులు ఉంటే ఏమి ఉపయోగం...పైగా సింహం గా చెప్పుకుని ఇప్పుడు సలహాదారులు పెట్టుకోవటం ఏంటో అన్న చర్చ వైసీపీ నాయకుల్లో సాగుతోంది.
అంటే జగన్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది...పార్టీని పునర్నిర్మిస్తే తప్ప వైసీపీ మనుగడ కష్టమని జగన్ భావించారా అన్న ప్రశ్నలు కూడా తెరమీదకు వస్తున్నాయి. ఈ లెక్కన స్వయంగా జగనే తన బ్రాండ్ పై తానే నమ్మకం కోల్పోయినట్లు ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఓటమి తర్వాత కొంత మంది సీనియర్ నేతలు చేసిన కామెంట్స్ ను కూడా జగన్ ఏ మాత్రం సానుకూలంగా తీసుకోలేదు అని...అలాంటి నాయకుడి నుంచి మార్పు ఆశించటం అత్యాశే అవుతుంది అని ఒక సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఈ పార్టీ నిర్మాణ సలహాదారుడి సలహాలు అయినా జగన్ వింటారా..అసలు అది జరిగే పనేనా అన్న చర్చ వైసీపీ లో సాగుతోంది. వై నాట్ 175 అంటూ ఎన్నికల ముందు సొంత పార్టీ నేతలు అందరిని భ్రమల్లో ఉంచిన జగన్ దారుణ పరిచయం తర్వాత కూడా వాస్తవాలు తెలుసుకోవటనికి ఏ మాత్రం సిద్ధంగా లేరు అని కొంత మంది నాయకులు చెపుతున్నారు. చాలా మంది ఇదే కారణంతో ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు అనే అభిప్రాయాన్ని కూడా పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.