Telugu Gateway
Andhra Pradesh

ఆ ముగ్గురు మహిళా మంత్రులకు చోటేది?

ఆ ముగ్గురు మహిళా మంత్రులకు చోటేది?
X

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం నాడు అట్టహాసంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించింది. దీనికి సంబంధించి ఆదివారం నాడు అన్ని ప్రముఖ పత్రికల్లో ఫుల్ పేజీ యాడ్స్ కూడా ఇచ్చింది. విచిత్రం ఏమిటి అంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా రోజు ఆంధ్ర ప్రదేశ్ మహిళా,శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఫోటో కు కూడా చోటు కల్పించలేదు. కానీ ఎప్పటిలాగానే ఈ యాడ్ లో ఆ శాఖతో ఏ మాత్రం సంబంధం లేని ఐటి, మానవనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ఫోటో మాత్రం వేశారు. గత కొంత కాలంగా ప్రతి ప్రభుత్వ యాడ్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటో కూడా వేస్తున్న విషయం తెలిసిందే. కానీ నారా లోకేష్ విషయానికి వస్తే మాత్రం ఆయన అందరి మంత్రుల లాంటి మంత్రే . అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొడుకు కావటంతో ఇలా ప్రత్యేకంగా ప్రతి యాడ్ లో కూడా నారా లోకేష్ తన ఫోటో వేయించుకుంటున్నారు. ఒక వైపు మహిళల కోసం ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుంది అని చెప్పుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కోట్లాది రూపాయలు ప్రజా ధనం ఖర్చుపెట్టి ఇచ్చిన యాడ్స్ లో సంబంధిత మంత్రి ఫోటో ఎగ్గొట్టి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ ఫోటో లు వేసుకోవటం ఏంటో అర్ధం కావటం లేదు అని అధికారులు కూడా అవాక్కు అవుతున్నారు.

కనీసం ఈ రోజు అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన క్యాబినెట్ లో ఉన్న ముగ్గురు మహిళా మంత్రుల ఫోటో లు ఈ యాడ్ లో వేసి ఉంటే ఆయన గౌరవం పెరిగి ఉండేది అని..అలా కాకుండా మహిళా దినోత్సవం యాడ్ లో కూడా వాళ్ళను వదిలేసి ఎప్పటి లాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో పాటు పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటో లు వేయటం ఏ మాత్రం సరికాదు అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబు క్యాబినెట్ లో హోమ్ మంత్రి గా అనిత, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా జీ. సంధ్యా రాణి, వెనకబడిన వర్గాల సంక్షేమ శాఖ మంత్రిగా ఎస్. సవితలు ఉన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు అయినా యాడ్ లో మహిళా మంత్రులకు చోటు కల్పించి ఉంటే ప్రభుత్వ ప్రతిష్ట పెరిగేది అని...కానీ ఇప్పుడు మహిళా మంత్రులను వదిలేసి ఏ మాత్రం సంబంధం లేని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఫోటోలు వేయటం విడ్డురంగా ఉంది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ యాడ్ సోషల్ మీడియా లో కూడా పెద్ద ఎత్తున చర్చ కు కారణం అవుతోంది.

Next Story
Share it