Telugu Gateway
Andhra Pradesh

మహానాడు తర్వాత కీలక పదవి

మహానాడు తర్వాత కీలక పదవి
X

తెలుగు దేశం పార్టీ లో అనధికారికంగా అధికారం చెలాయిస్తున్న వ్యక్తికి త్వరలోనే పార్టీ లో కీలక పదవి దక్కనుందా?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక కీలక మంత్రి తరపున ఆయనే అన్నీ నడిపిస్తున్నారు అనే ప్రచారం టీడీపీ వర్గాల్లో ఉంది. పవర్ ప్రాజెక్ట్ ల దగ్గర నుంచి బదిలీల వరకు ఆయన జోక్యం లేకుండా ఏ పని కాదు అన్నది టీడీపీ నేతలే కాదు ..కొంత మంది మంత్రులు కూడా చెపుతున్న మాట. గనుల శాఖ తో పాటు పలు కీలక శాఖల్లో ఆయన ఆదేశాల ప్రకారమే ఫైల్స్ పరుగెడతాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. కొంత మంది మంత్రులను అయితే ఈ కిమ్ మరీ డమ్మీలను చేసి ఆడిస్తున్నారు అనే ప్రచారం కూడా టీడీపీ వర్గాల్లో ఉంది. అయితే అనధికారికంగా ఇప్పటి వరకు తెర వెనక ఉండి పనులు సాగిస్తున్న కిమ్ కు మహానాడు తర్వాత పార్టీ లో కీలక పదవి కట్టబెట్టబోతున్నట్లు టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. పార్టీ లో కీలక పదవి దక్కిన తర్వాత కూడా కిమ్ తెర వెనక ఉండి పనులు చక్కబెడతారా లేక తెర ముందుకు వస్తారా అన్నది తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

మహానాడు తర్వాత పార్టీ లో కీలక బాధ్యతలు అప్పగించటమే కాదు... కూటమి ప్రభుత్వం ఈ టర్మ్ ముగిసే లోగా ఆయనకు రాజ్య సభ సీటు కూడా కేటాయించే అవకాశం ఉంది అని..అందులో భాగంగానే ఇప్పటి వరకు ఎక్కువగా తెర వెనక ఉన్న కిమ్ ను తెర ముందుకు తెచ్చే ప్రయత్నాలు సాగుతున్నట్లు చెపుతున్నారు. ఇప్పుడు పార్టీ లో కూడా కీలక పదవి అప్పగించి తర్వాత ఆయన సేవలకు గుర్తింపుగా పదవి ఇచ్చినట్లు చెప్పటానికే రంగం సిద్ధం చేసినట్లు చెపుతున్నారు. ఇదిలా ఉంటే మహానాడు తర్వాత పార్టీ లో భారీ ఎత్తున మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది అని టీడీపీ నేతలు చెపుతున్నారు. ఎక్కువ మంది సీనియర్లను పక్కన పెట్టి కొత్త రక్తం ఎక్కించే పనిలో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు చెపుతున్నారు. అయితే కొత్త రక్తం అంటే ఎక్కువ శాతం ప్రస్తుతం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రిగా ఉన్న నారా లోకేష్ టీం ను తెర మీదకు తీసుకురాటమే అన్నది కొంత మంది నేతల అభిప్రాయంగా ఉంది. తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ దిశగా ఇప్పటికే అందరిని డ్రైవ్ చేస్తున్నారు అనే చర్చ కూడా పార్టీ నాయకుల్లో ఎప్పటి నుంచో సాగుతోంది.

Next Story
Share it