Telugu Gateway
Andhra Pradesh

జగన్ కు ఇప్పుడు డబల్ టెన్షన్!

జగన్ కు ఇప్పుడు డబల్ టెన్షన్!
X

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయం ఇక పూర్తిగా మారబోతోంది. గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించి జగన్ గెలుపు కోసం పనిచేసిన వై ఎస్ షర్మిల ఇప్పుడు నేరుగా ఆయనతో తలపడటానికి రెడీ అయ్యారు. ఇప్పటివరకు ఏవో నర్భగర్భ వ్యాఖ్యలు చేస్తూ వచ్చిన షర్మిల ఇక ఇప్పుడు వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై డైరెక్ట్ ఎటాక్ చేయక తప్పని పరిస్థితి. ప్రస్తుత రాజకీయ వాతావరణం చూస్తుంటే ఆమె ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గే అవకాశాలు లేవు అనే చర్చ సాగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం వై ఎస్ షర్మిలను ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నియమిస్తూ మంగళవారం నాడు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుంది అని ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఖచ్చితంగా జగన్ కు రాజకీయంగా టెన్షన్ తెచ్చే పరిణామమే. దివంగత రాజశేఖర్ రెడ్డి కొడుకు వైసీపీ అధ్యక్షుడిగా, సీఎం గా ఉంటే, మరో వైపు వై ఎస్ కూతురిగా షర్మిల కాంగ్రెస్ వైపు నిలబటంతో రాజశేఖర్ రెడ్డి అభిమానుల్లో చీలిక రావటం ఖాయం అనే అంచనాలు ఉన్నాయి. షర్మిలకు పీసిసి పగ్గాలు ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ఎన్నికల్లో ఖాతా తెరవటంతో పాటు ఓటు బ్యాంకు ను గణనీయంగా పెంచుకోవాలనే ప్లాన్ లో ఉంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎంత మేర పెరిగితే అంత మేర అది వైసీపీకి రాజకీయంగా పెద్ద దెబ్బ అనే అంచనాలు ఉన్నాయి.

ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు వ్యవహారం వైసీపీ కి పెద్ద సవాల్ గా మారబోతుంది. ఇప్పుడు షర్మిల ఏపీ కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు తీసుకోవటంతో వైసీపీ లో టెన్షన్ వాతావరణం నెలకొంది అని చెప్పొచ్చు. ఎన్నికలకు ముందు కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రకటించిన జగన్ ప్రజలు గత ఎన్నికల్లో ఇరవై రెండు మంది ఎంపీలను గెలిపించినా చేసింది ఏమి లేదు. ప్రత్యేక హోదా కాదు కదా...విభజన హామీలు సాధించటంలో కూడా అయన విఫలం అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా తో పాటు విశాఖ స్టీల్ వంటి అంశాలపై ఫోకస్ పెట్టి తిరిగి ఆంధ్ర ప్రదేశ్ లో తన ఉనికి చాటుకోవాలని ప్రయత్నాల్లో ఉంది. అందులో భాగంగానే షర్మిలను రంగంలోకి దింపారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలకు సమయం ఇంకా నిండా మూడు నెలలు కూడా లేదు. ఈ తరుణంలో షర్మిల కాంగ్రెస్ పై ఎంత మేర ప్రభావం చూపిస్తారు అన్నది వేచిచూడాల్సిందే. గతంలో అన్న కోసం పని చేసిన షర్మిల ఇప్పుడు అన్న ఓటమి కోసం రంగంలోకి దిగటంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారబోతున్నాయి.

Next Story
Share it