Telugu Gateway
Andhra Pradesh

చివరకు ఆ విషయం కూడా చంద్రబాబే చెప్పాలా!

చివరకు ఆ విషయం కూడా చంద్రబాబే చెప్పాలా!
X

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీరుపై ఇప్పటికే ఆ పార్టీ నేతలు...క్యాడర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ లో మరో పదిహేను సంవత్సరాలు చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వమే ఉండాలని పదే పదే చెపుతూ వస్తున్న విషయమే. జనసేన కు ఉన్న ఓటు బ్యాంకు తో సొంతంగా అధికారంలోకి రావటం సాధ్యం అవుతుందా లేదా అన్న సంగతి కాసేపు పక్కన పెడితే కనీసం సొంతంగా పార్టీని నిర్మించుకుని...కీలక శక్తిగా ఎదిగే ప్రయత్నం చేయకుండా ...మరో పదిహేను సంవత్సరాలు టీడీపీతో కలిసి ఉండటమే అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ నిత్యం బహిరంగ వేదికలపై చెపుతుండటం జనసేన నాయకులతో పాటు క్యాడర్ కు ఏ మాత్రం రుచించటం లేదు. మీకు మాత్రం పదవులు వస్తే చాలు..పార్టీ కోసం రాష్ట్రం అంతటా పనిచేసే వాళ్ళ సంగతి ఏంటి అనే చర్చ కూడా ఆ పార్టీ నేతల్లో సాగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా కూటమిని బ్రేక్ చేయలేరు అని చెపుతున్నారు. ఇది ఇలా ఉంటే అమరావతి లో బుధవారం నాడు జరిగిన మంత్రి వర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అటు పవన్ కళ్యాణ్ తో పాటు బీజేపీ నేతలకు చేసిన సూచన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

‘ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ అగ్రనేతలు కూడా వాళ్ళ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడాలి అని చంద్రబాబు సూచించారు ’ అని మీడియా లో వార్తలు వచ్చాయి. అదే సమయంలో చంద్రబాబు తాను ఇప్పటికే 24 మంది టీడీపీ ఎమ్మెల్యేలతో ముఖాముఖి మాట్లాడి వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ ని వివరించినట్లు చెప్పారు. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎమ్మెల్యేలతో మాట్లాడాలి అనే విషయం కూడా చంద్రబాబే చెప్పాలా...అంటే పవన్ కళ్యాణ్ అంతా చంద్రబాబు డైరక్షన్ ప్రకారమే నడుస్తున్నారు అనే సంకేతం ప్రజల్లోకి వెళ్లదా అన్న చర్చ జనసేన నేతల్లో సాగుతోంది. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన అధినేత తన సొంత పార్టీ ఎమ్మెల్యే లతో సమావేశాలు అయింది కూడా అతి తక్కువ సార్లు మాత్రమే అని ఆ పార్టీ నాయకులు చెపుతున్నారు.

మరో వైపు టీడీపీ ఎమ్మెల్యే ల పై వచ్చిన తరహాలోనే కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న జనసేన కు చెందిన కొంత మంది ఎమ్మెల్యేలపై కూడా పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ నోరు తెరిచి మాట్లాడినట్లు కానీ ...వాళ్లకు హెచ్చరిక సంకేతాలు పంపిన సందర్భం కూడా లేదు అని చెపుతున్నారు. పార్టీ కి చెందిన ఇతర చిన్న నాయకులపై ఏమైనా ఆరోపణలు వస్తే వెంటనే స్పందిస్తున్న జనసేన అధినేత ఎమ్మెల్యేల విషయంలో మాత్రం అంత స్పీడ్ గా స్పందిస్తున్న దాఖలాలు లేవు అని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. జనసేన కు చెందిన ఎమ్మెల్యేల అవినీతిపై మీడియా లో పెద్ద ఎత్తున ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు సూచన మేరకు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేలతో సమావేశం పెడతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇక్కడ మరో కీలక విషయం ఏమిటి అంటే అత్యంత కీలకమైన పంచాయతీ రాజ్ శాఖ చూస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో ఎక్కువ మంది ఎమ్మెల్యేలకు పని ఉంటుంది. కానీ ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలకే కాదు...అధికార కూటమిలో భాగస్వామిగా ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కూడా అందుబాటులో ఉండటం కష్టమే అనే చర్చ అన్ని పార్టీల నేతల్లో ఉంది. బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి మరి చంద్రబాబు చెప్పిన విధంగా పార్టీ ఎమ్మెల్యేలతో ఎవరు సమావేశం అవుతారు..ఏమి చెపుతారు అన్నది చూడాలి. మంత్రి వర్గ సమావేశం లో అధికారిక ఎజెండా పూర్తి అయిన తర్వాత మంత్రులతో రాజకీయ అంశాలు చర్చించినప్పుడు ఈ విషయాలు ప్రస్తావనకు వచ్చినట్లు చెపుతున్నారు.

Next Story
Share it