కూటమి ప్రభుత్వమే కామెడీగా మారిందా?!

ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వమే కామెడీ గా మారిందా అంటే అవుననే సమాధానం వస్తోంది కూటమి నేతల నుంచి. చెప్పేదానికి...చేసేదానికి ఏ మాత్రం పొంతన లేకుండా చేయటంలో కూటమి నేతలు ఒకరిని మించి ఒకరు వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి మాట్లాడటం...అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించటం కూటమి నేతలకు అలవాటుగా మారిపోయింది అనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సెకి ఒప్పందాల దగ్గర నుంచి...విద్యుత్ కాంట్రాక్టుల విషయంలో టీడీపీ నాయకులు ఏకంగా కోర్ట్ లకు కూడా వెళ్లారు . అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అంతా సైలెంట్ అయిపోతున్నారు. పైకి కనిపించేవి కాకుండా తెర వెనక కూడా ఎన్నో విషయాలు సాగిపోతున్నాయని టీడీపీ నేతలే చెపుతున్నారు.
ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్తుతం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశంపై అధికార టీడీపీ, వైసీపీ ల మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం సాగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విషయంలో ఇప్పుడు కూటమి సర్కారు ఆత్మరక్షణలో పడింది అనే అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తున్నారు. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ మీడియా సమావేశంలో సంచలన ఆరోపణలు చేశారు. అదేంటి అంటే జగన్ హయాంలో మంజూరు అయిన వైద్య కళాశాలల నిర్మాణంలో అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి భారీ అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపించారు. కాంట్రాక్టర్ ల నుంచి ఒక్క కాలేజీ కి వంద కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారు అని చెప్పారు. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసి ) నిబంధనల ప్రకారం 420 పడకలు గల హాస్పిటల్ నిర్మించాలంటే 320 కోట్ల రూపాయల వ్యయం అవుతుంది అని అంచనా అని తెలిపారు.
కానీ గత జగన్ ప్రభుత్వం మాత్రం ఈ కాలేజీల నిర్మాణ వ్యయాన్ని 500 నుంచి 600 కోట్ల రూపాయలకు పెంచి పరిపాలన ఆమోదం ఇచ్చారు అన్నారు. ఈ పనులు వేరే వాళ్ళ చేతికి వెళితే ఈ కమిషన్ ల వ్యవహారం బయటపడుతుంది అని మెడికల్ కాలేజీల విషయంలో జగన్ రాద్ధాంతం చేస్తున్నారు అని మంత్రి ఆరోపించారు. మరి మెడికల్ కాలేజీల నిర్మాణానికి సంబంధించి అవినీతి జరిగినట్లు ఇంత స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం ప్రెస్ మీట్ పెట్టి చెప్పి వదిలేయటం వెనక కారణం ఏమై ఉంటుంది అన్న చర్చ ఇప్పుడు తెర మీదకు వస్తోంది. మరి ఇప్పుడు పీపీపీ విధానంలో ఇస్తున్న కాలేజీలను కూడా సత్య కుమార్ చెపుతున్న లెక్కల ప్రకారమే ఇస్తారా లేక జగన్ ఆమోదించిన అంచనాలనే ఒకే చేస్తారా అన్నది చూడాలి. అవేమి కాకుండా కూటమి ప్రభుత్వం మరింత ఉదారంగా ఇంకా రేట్లు పెంచుతుందా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు.



