Telugu Gateway
Andhra Pradesh

ఈ చంద్రబాబు...ఆ చంద్రబాబేనా!

ఈ చంద్రబాబు...ఆ చంద్రబాబేనా!
X

చంద్రబాబు నేను మారాను ..మారాను అని చెప్పిన ఎప్పుడూ మారలేదు. కానీ ఈ సారి మాత్రం చంద్రబాబు చెప్పకుండానే మారిపోయారు. శనివారం నాడు తెలుగు దేశం అధినేత ప్రకటించిన తొలి జాబితా చూసిన తర్వాత పార్టీ నాయకుల ఫీలింగ్ అది. ఒకే సారి చంద్రబాబు నాయుడు ఏకంగా 94 సీట్లు ప్రకటించటం అంటే అది పెద్ద సంచలనం కిందే లెక్క. ఎందుకంటే రెండు దశాబ్దాల కాలంలో అయన ఎప్పుడూ కూడా తాను పోటీ చేసే కుప్పం సీటు ప్రకటించటానికి కూడా చాలా సమయం తీసుకునే వారు. ఎక్కడి వరకో ఎందుకు గత ఎన్నికల్లో అప్పుడు మంత్రిగా ఉన్న నారా లోకేష్ మంగళగిరి లో పోటీ చేసే విషయం చివరి నిమిషం వరకు తేల్చని సంగతి తెలిసిందే. ఇది కూడా లోకేష్ ఓటమికి ఒక కారణం అని అప్పటిలో చంద్రబాబుపై పార్టీ నాయకులు విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పటి కంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ వ్యవహారాలు తప్ప పెద్దగా ఇతర పనులు ఏమీ ఉండవు. దీంతో ఏ నాయకుడు అయినా కూడా అభ్యర్థుల ఖరారు తో పాటు ఇతర అంశాలపై ఫోకస్ పెట్టడానికి ఎక్కువ సమయం దక్కుతుంది. కానీ చంద్రబాబు ఓల్డ్ స్టైల్ మాత్రం ఏదీ చివరి నిమిషం వరకు తేల్చకుండా ఉండటమే. గత కొన్ని నెలల కాలంగా అధికార వైసీపీ సర్కారు చంద్రబాబు పై వరస పెట్టి కేసు లు పెట్టడం...స్కిల్ డెవెలప్ మెంట్ కేసు విషయంలో ఏకంగా చంద్రబాబు ను అరెస్ట్ చేసి జైలు లో పెట్టడంతో పార్టీ వ్యవహారాలు ఒకింత పక్కదారి పట్టిన విషయం తెలిసిందే. జనసేన తో పొత్తు ఉండటంతో ఆ పార్టీ కి ఎన్ని సీట్లు ఇవ్వాలి...అవి ఎక్కడ అనే విషయంలో నిర్ణయం తీసుకోవటం కూడా ఈ సారి చంద్రబాబుకు పెద్ద పరీక్షగా మారింది అనే చెప్పాలి.

ఈ విషయంలో రాబోయే రోజుల్లో టికెట్ దక్కని వారి నుంచి సమస్యలు ఎదురుకావడం సహజమే. అయితే అన్నిటి కంటే ముఖ్యం 94 సీట్ల విషయంలో చంద్రబాబు ఒకేసారి నిర్ణయం తీసుకోవటమే పార్టీ నాయకులకు కూడా పెద్ద సర్ప్రైజ్ గా మారింది అనే చెప్పాలి. టీడీపీ పోటీ చేసే మిగిలిన 57 సీట్లను షెడ్యూల్ కంటే ముందే ప్రకటిస్తారా లేదా అన్న ఆసక్తి ఇప్పుడు అందరిలో నెలకొంది. మరో వైపు టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ చేరుతుందా లేదా అన్న అంశం కూడా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర అంశంగా ఉంది. బీజేపీ విషయంలో క్లారిటీ వస్తే టీడీపీ వెంటనే మిగిలిన అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది అని పార్టీ నేతలు చెపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీకి రాజకీయంగా ఎంతో కీలకం అనే విషయం తెలిసిందే. మరో వైపు ఎలాగైనా సరే ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో జనసేన వాయిస్ బలంగా వినిపిస్తామంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూడటంతో పాటు పొత్తులో భాగంగా తీసుకున్న సీట్లలో ప్రధానంగా గెలుపే ప్రాతిపదికగా తీసుకుంటున్నట్లు చెపుతూ వస్తున్నారు. తొలి సారి చంద్రబాబు నాయుడు తీసుకున్న ఈ సంచలన నిర్ణయం ఎంత మేర సత్ఫాలితాలు ఇస్తుందో వేచిచూడాలి.

Next Story
Share it