Telugu Gateway
Andhra Pradesh

పొలిటికల్ ‘సేఫ్ గేమ్’ !

పొలిటికల్ ‘సేఫ్ గేమ్’ !
X

నారా లోకేష్ ను ముఖ్యమంత్రి సీటు లో కూర్చో పెట్టే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్లాన్ ఏంటో ఎవరికీ తెలియదు. కానీ ఈ విషయంలో జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం నారా లోకేష్ కు లైన్ క్లియర్ చేస్తున్నట్లే కనిపిస్తోంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇటీవల చోటు చేసుకున్న వరస పరిణామాలే దీనికి ఊతం ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితమే అమరావతిలో పోలీస్ కానిస్టేబుల్స్ నియామక పత్రాలు అందించటానికి ఒక కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోమ్ మంత్రి అనిత లు పాల్గొన్నారు. అదే రోజు నారా లోకేష్ వైజాగ్ లో జీఎంఆర్, మాన్సాస్ ట్రస్ట్ లు సంయుక్తంగా ఏర్పాటుచేయనున్న ఏరో డిఫెన్స్ సిటీ ఎంఓయూ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ మీటింగ్ లో అవసరం లేకపోయినా కూడా మంత్రి నారా లోకేష్ ఇక్కడ లేకపోవటం లోటు గా ఉంది అంటూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. వాస్తవానికి ఆ కార్యక్రమానికి నారా లోకేష్ కు ఎలాంటి సంబంధం లేదు.

కానీ పవన్ కళ్యాణ్ ఈ మాటలు చెప్పటం రెండు పార్టీల్లో హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు పవన్ సోమవారం నాడు జనసేన నాయకుల పదవి-బాధ్యత సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కూడా ఇవే సంకేతాలను పంపినట్లు అయింది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరో పది, పదిహేను సంవత్సరాలు కూటమే అధికారంలో ఉండాలని ఆయన మరో సారి చెపుతూ ఇందుకు తనదైన స్టైల్ లో వివరణ ఇచ్చారు. ఇలా అనటం మన పార్టీ తగ్గాలని...ఎవరినో బలోపేతం చేయాలని కాదు అంటూ చెప్పుకొచ్చారు. ముందు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన తర్వాత...అందరూ ఒక స్థాయికి వచ్చిన అప్పుడు వేరే ఆలోచన చేద్దాం అన్నారు. అప్పటి వరకు కూటమి బలంగా ఉండాలని కోరుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వయస్సు 54 సంవత్సరాలు. అంటే ఆయన చెప్పిన ప్రకారమే పవన్ కళ్యాణ్ సీఎం పోస్ట్ గురించో ..మరొకటో ఆలోచించాలి అంటే ఇంకో పది నుంచి పదిహేను సంవత్సరాలు ఆగాల్సిందే అని చెపుతున్నారు. అప్పటికి ఆయన వయసు 65 నుంచి 70 సంవత్సరాలకు వస్తుంది. ఇది అంతా చూసిన జనసేన నాయకుల తోపాటు టీడీపీ నేతలు కూడా పవన్ కళ్యాణ్ రాజకీయంగా సేఫ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పదే పదే మరో పది, పదిహేను సంవత్సరాలు కూటమే అధికారంలో ఉండాలి అని చెపుతుండటం జనసేన నాయకులు..క్యాడర్ కు నచ్చటం లేదు. ఈ విషయంలో వాళ్ళు ఏమి అనుకుంటున్నారో పవన్ కళ్యాణ్ కు కూడా తెలుసు కాబట్టి ఆయన సోమవారం నాడు జరిగిన సమావేశంలో వివరణ ఇచ్చినట్లు ఉంది అనే అభిప్రాయం ఆ పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు. కూటమే మరో పది, పదిహేనేళ్ళు అధికారంలో అంటే ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు..లేదు అంటే నారా లోకేష్ మాత్రమే ఉంటారు. అంతే తప్ప పవన్ కళ్యాణ్ కు ఛాన్స్ రాదు అనే విషయం తెలిసిందే. ఒక్క మాటలో చెప్పాలంటే జనసేన నాయకులకు పదవులు..సీట్లు ఏమి వచ్చాయి అనే కంటే..పవన్ కళ్యాణ్ కు ఈ ప్రభుత్వంలో ఎంతో కంఫర్ట్ ఉంది అని...మరో చోట ఎక్కడా కూడా ఆయన కు ఇలాంటి పరిస్థితి ఉండదు అని చెపుతున్నారు. పైగా ఆయన అసెంబ్లీ సమావేశాలు అయినా..కలెక్టర్ల సమావేశం అయినా తాను అనుకున్నప్పుడు వస్తున్నారు తప్ప...విధిగా వీటికి రావాలని బలవంతం కూడా ఆయనపై ఎక్కడా ఉన్నట్లు కనిపించటంలేదు అని టీడీపీ నేతలతో పాటు...జనసేన నాయకులు కూడా చెపుతున్నారు.

పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ స్టాండ్ కారణంగా ఆయన అభిమానులు...నాయకులు రాబోయే రోజుల్లో కొంత మంది దూరం అయినా కూడా కూటమికి ఎలాంటి ఢోకా ఉండదు అని.....అదే సమయంలో కూటమిలో కూడా పవన్ కళ్యాణ్ కు కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే ఆయన ఈ సేఫ్ జోన్ మోడల్ ను ఎంచుకున్నట్లు కనిపిస్తోంది అని టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. పైగా జనసేన కు ఉన్న బలం ఆధారంగా చూసుకుంటే ఎవరో ఒకరితో కలిస్తే తప్ప సొంతంగా ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం సీటు దక్కించుకోవటం అన్నది కూడా సాధ్యం అయ్యే పని కాదు ఇప్పుడు ఉన్న బలాబలాల ప్రకారం. కాకపోతే జగన్ తో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ కు కూటమి ప్రభుత్వంలోనే ఆయన కు ఎక్కువ సౌలభ్యం. ఇక్కడ అన్ని రకాలుగా ఏది అనుకుంటే అది అయిపోవడంతో పాటు ఆయన పవర్ ఎంజాయ్ చేస్తున్నారు అని రెండు పార్టీల నేతలు చెపుతున్నారు. ప్రతిపక్షం బెదిరిస్తోంది అని చెపుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ టెండర్ల లో కమిషన్ కోసం ఒక ఎంపీకి ఎమ్మెల్యే సోదరుడు బెదిరించిన విషయాన్నీ మర్చిపోయారు. మరో వైపు కొంత మంది టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు జన సేన ఎమ్మెల్యేల బెదిరింపులు ఎన్నో బయటకు వచ్చాయి కూడా. ఇవి అన్ని పవన్ కళ్యాణ్ దృష్టిలో ప్రజాస్వామిక చర్యలేమో. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఎక్కడ ఏమి జరిగినా తనకు తెలుస్తుంది అని చెప్పిన పవన్ కళ్యాణ్ కు ఇప్పుడు ప్రభుత్వంలో ఏమి జరుగుతుందో తెలియదా?.

Next Story
Share it