Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ మారిపోయాడు !

పవన్ కళ్యాణ్ మారిపోయాడు !
X

జనసేన అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణ ను పూర్తిగా వదిలేసినట్లేనా?. తాజా వరదలతో ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ కూడా భారీగా నష్టపోయింది. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ వరద బాధితుల సాయం కోసం కోటి రూపాయల సాయం ప్రకటించారు. ఇందులో తప్పుపట్టాల్సింది ఏమీ లేదు. కానీ ఆయన తెలంగాణ కు సాయం విషయంలో మాత్రం ఎలాంటి ప్రకటన చేయకపోవటం పలు విమర్శలకు కారణం అవుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడే కాకుండా..నటుడు కూడా అన్న విషయం తెలిసిందే. పైగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ మూడు సినిమాలు విడుదల కావాల్సి ఉన్నాయి. ఇందులో ఒకటి ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీర మల్లు. ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నంత మాత్రాన తెలంగాణకు సాయం చేయటంపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. పైగా ఇదే పవన్ కళ్యాణ్ తెలంగాణ పై తనకు ప్రత్యేక అభిమానం ఉంది అంటూ పలు మార్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతే కాదు...భవిష్యత్ లో ఏమి చేస్తారో తెలియదు కానీ...ఇప్పటికైతే తెలంగాణాలో జనసేన పార్టీ ఉంది. పవన్ కళ్యాణ్ కు ఇక్కడ పెద్ద ఎత్తున ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఒక వైపు టాలీవుడ్ కు చెందిన టాప్ హీరో లు అందరూ ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ కు కూడా సాయం ప్రకటిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ అన్న , మెగాస్టార్ చిరంజీవి కూడా తెలంగాణ కు ఏభై లక్షల రూపాయలు, ఆంధ్ర ప్రదేశ్ కు ఏభై లక్షల రూపాయల సాయం ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ తో పాటు ఎన్టీఆర్, మహేష్ బాబు కూడా ఇదే పని చేశారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క ఆంధ్ర ప్రదేశ్ కు మాత్రమే కోటి రూపాయల సాయం ప్రకటించటం చర్చనీయాంశంగా మారింది. ఎక్కడ వరకో ఎందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ వైజంతి మూవీస్ తీరుపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. తొలుత సాయం ప్రకటించిన సంస్థ ఇదే అయినా....25 లక్షల సాయం ఆంధ్ర ప్రదేశ్ కు మాత్రమే ప్రకటించారు. ఈ సంస్థ కూడా పూర్తిగా తెలంగాణ ను విస్మరించింది. ఇటీవలే వైజంతి మూవీస్ నిర్మించిన కల్కి సినిమా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 1100 కోట్ల రూపాయల పైన వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. ఈ సంస్థ ఏపీకి అందించిన సాయంపై విమర్శలు ఉండగా...తెలంగాణ కు అసలు సాయం ప్రకటించక పోవటం మరింత వివాదాస్పదం అయింది.

Next Story
Share it