Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు పోలవరం టూర్ లో కనిపించని మేఘా అధినేత

చంద్రబాబు పోలవరం టూర్ లో కనిపించని మేఘా అధినేత
X

హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పోలవరం టూర్ లో మేఘా అధినేత కృష్ణారెడ్డి ఎక్కడా కనిపించకపోవడం అటు అధికార వర్గాలతో పాటు..రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ మారింది. మేఘా కృష్ణా రెడ్డి ను చంద్రబాబే రావద్దని చెప్పారా ...లేక కృష్ణా రెడ్డి దూరంగా ఉన్నారా అన్న చర్చ కూడా సాగుతోంది. ప్రభుత్వం మారిన తర్వాత పోలవరం వంటి కీలక ప్రాజెక్ట్ సందర్శనకు ముఖ్యమంత్రి వెళితే ఆ ప్రాజెక్ట్ పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థ అధినేత రావటం అన్నది సాధారణ విషయం. గతంలో సీఎం ప్రాజెక్ట్ విజిట్ కు వెళ్లిన సమయంలో అక్కడ కృష్ణారెడ్డి కూడా హాజరు అయి ప్రాజెక్ట్ పురోగతి గురించి వివరించిన విషయం తెలిసిందే. కానీ ఈ సారి మాత్రం అలా జరగకపోవటంతో ఇది చర్చనీయాంశంగా మారింది. గతంతో పోలిస్తే చంద్రబాబు ఈ సారి కొన్ని విషయాల్లో చాలా కఠినంగానే ఉంటున్నట్లు కనిపిస్తోంది. అందుకు ఉదాహరణ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల వెళ్లాలని నిర్ణయించుకున్న చంద్రబాబు ఆ వెంటనే టీటీడీ ఈఓ ధర్మారెడ్డి ని సెలవుపై పంపిన విషయం తెలిసిందే.

ఇప్పుడు అలాగే చంద్రబాబు తాను ఎంతో ప్రాధాన్యత ఇచ్చే పోలవరం ప్రాజెక్ట్ విషయంలో కూడా అలాగే చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో ఉన్న కాంట్రాక్టర్ ను తప్పించి పనులన్నిటినీ రివర్స్ టెండరింగ్ పేరుతో మేఘా ఇంజనీరింగ్ కు కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీని ద్వారా తాము వందల కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు కూడా ప్రచారం చేసుకున్నారు. వందల కోట్లు ఆదా చేశామని చెప్పి ఏకంగా 4500 కోట్ల రుపాయల పనులను మళ్ళీ మేఘా సంస్థకు కట్టబెట్టారు. జగన్ చేసిన ఆదా సంగతేమో కానీ..బటన్ నొక్కే కార్యక్రమాలపై ఫోకస్ పెట్టి ఈ ప్రాజెక్ట్ ను నిర్లక్ష్యం చేసిన మాట నిజం. అంతే కాదు..కేంద్రం నుంచి ఈ ప్రాజెక్ట్ భూసేకరణ కోసం వచ్చిన నిధులను కూడా జగన్ సర్కారు పక్కదారి పట్టించినట్లు అధికారులు చెపుతున్నారు.

రివర్స్ టెండరింగ్ వల్ల ఆదా అయిన సంగతి ఏమో కానీ...జగన్ చేసిన జాప్యం వల్ల పోలవరం ప్రాజెక్ట్ వ్యయం ఇప్పుడు మరింత పెరిగే అవకాశం ఉంది అనే చర్చ కూడా సాగుతోంది. మరి చంద్రబాబు మేఘా ఇంజనీరింగ్ కు జగన్ సర్కారు అప్పనంగా కేటాయించిన 4500 కోట్ల రూపాయల పైగా ఉన్న అదనపు పనుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు...అసలు ఇప్పుడు కాంట్రాక్టర్ మార్పు సాధ్యం అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ పనుల నుంచి మేఘా ను తప్పించే అవకాశాలు ఏ మాత్రం లేవు అని..పనులు వేగంగా పూర్తి చేసేందుకు కొత్త సంస్థలను కూడా రంగంలోకి దించే ఛాన్స్ లు ఉన్నట్లు చెపుతున్నారు. ఈ విషయాలన్నీ తేలాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంది. సోమవారం నాడు పోలవరం లో పర్యటించిన చంద్రబాబు మేఘా డైరెక్టర్ సుబ్బయ్య పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. ఐదేళ్లలో ప్రాజెక్ట్ ను నాశనం చేశారంటూ ఆయనపై అసహనం వ్యక్తం చేసినట్లు అక్కడ ఉన్న వాళ్ళు వెల్లడించారు. ఇది ఇలా ఉంటే ఈ వార్త పబ్లిష్ చేసిన తర్వాత వచ్చిన సమాచారం ప్రకారం మేఘా ఇంజనీరింగ్ అధినేత కృష్ణారెడ్డి విదేశీ పర్యటనలో ఉన్నారని...అందుకే ఆయన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పర్యటనలో పాల్గొనలేక పోయారు అని సమాచారం. అంతే తప్ప ఇందులో ఇతర కారణాలు ఏమి లేవు అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి.

Next Story
Share it