Telugu Gateway
Andhra Pradesh

అక్రమాలే సహించని నేత ..అన్ని అక్రమకట్టడాలు కట్టించారా!

అక్రమాలే సహించని నేత ..అన్ని అక్రమకట్టడాలు కట్టించారా!
X

వై ఎస్ జగన్ కు అక్రమాలు..అక్రమకట్టడాలు అంటే ఏ మాత్రం గిట్టదు. ఈ మాట ఆయన చెప్పిందే. సీఎం అయిన కొత్తలో ప్రజావేదికలో కూర్చుని చాలా గంభీరంగా ఈ మాటలు చెప్పారు. అంతే కాదు అక్రమకట్టడం అయిన ప్రజావేదికను కూల్చివేయాలని ఆదేశించారు. అప్పటిలో అది ఒక పెద్ద సంచలనం అయిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సాక్షిగా కూడా జగన్ అధికారంలో ఉన్న వాళ్లకు ఒక రూల్ ..సామాన్యులకు మరో రూలా అని ప్రశ్నించారు. అక్రమకట్టడాలను ఏ మాత్రం సహించేది లేదు అన్నారు. జగన్ ఐదేళ్ల పాలన ఇటీవలే అయిపొయింది...మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. జగన్ ఐదేళ్ల తన పాలన కాలంలో రాజధాని కట్టలేదు. పోలవరం పూర్తి చేయలేదు. ఇతర నిర్మాణాలు కూడా ఏవీ చెప్పుకునేవి లేవు. కానీ అసలు అక్రమాలే సహించని జగన్....పార్టీ కార్యాలయాల పేరుతో ఇన్ని అక్రమకట్టడాలు నిర్మించటం ఏమిటో అన్నది ఇప్పుడు అందరి మదిని వేధిస్తున్న ప్రశ్న. అధికారంలో ఉన్న పార్టీలు తమ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములు తీసుకుంటున్నాయి.

ఇది గతంలో జరిగింది. తెలంగాణ తో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో కూడా గతంలో అధికారంలో ఉన్న పార్టీలు అదే చేశాయి. ఇదే మోడల్ ను జగన్ మోహన్ రెడ్డి కూడా ఫాలో అయ్యారు. అయితే ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే...కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను పార్టీ ఆఫీస్ లకు లీజ్ పేరుతో తీసుకుని ...ఏకంగా 25 చోట్ల ఎలాంటి అనుమతులు కూడా లేకుండా భవనాలను పూర్తి చేశారు. అనుమతులు లేని భవనం అంటే అది ఖచ్చితంగా అక్రమ నిర్మాణం కిందే లెక్క. జగన్ ఒక సందర్భంలో పెద్ద పెద్ద భవనాలు కడితేనే అభివృద్ధి కాదు అంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాలకు పనికివచ్చే ప్రాజెక్ట్ లు ఏమి కట్టని జగన్ వైసీపీ పార్టీ కోసం పెద్ద పెద్ద రాజప్రాసాదం తరహా భవనాలను కట్టుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ మీడియా లో రావటంతో అవాక్కు అవటం జనం వంతు అవుతోంది. తాడేపల్లి లో వైసీపీ కోసం నిర్మిస్తున్న పార్టీ కార్యాలయాన్ని శనివారం నాడు అధికారులు కూల్చివేశారు.

ఈ భూమి పార్టీ ఆఫీస్ కు కేటాయించటం కుదరదు అని కొంతమంది అధికారులు ఫైల్ లో రాసినా కూడా అధికార వైసీపీ బలవంతంగా తీసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టింది. ఈ భూమి విషయంలో ఎన్ని ఉల్లంఘనలకు పాల్పడాలో అన్ని చేసింది గత వైసీపీ సర్కారు. అక్రమ కట్టడాలు కూల్చివేస్తే మరో వైపు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాత్రం చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది అని ట్వీట్ చేశారు. ఒక నియంతలా తాడేపల్లి లో దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ పార్టీ ఆఫీస్ ను బుల్డోజర్స్ తో కూల్చివేయించారు అంటూ ఆరోపించారు. ఆంధ్ర ప్రదేశ్ మొత్తంలో వైసీపీ ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ కార్యాలయాలు నిర్మించటం చూస్తే జగన్ పాలన ఎలా సాగిందో అర్ధం చేసుకోవచ్చు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి అనుమతులు లేకుండా వైసీపీ నిర్మించిన పార్టీ కార్యాలయాలపై కూటమి సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్నది వేచిచూడాల్సిందే.

Next Story
Share it