రేవంత్ రెడ్డి చెప్పింది నిజమేనా!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఢిల్లీలో చేసిన కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అవేంటి అంటే ఆంధ్ర ప్రదేశ్ ఐటి, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లు మూడు సార్లు రహస్య భేటీ అయ్యారు అని సంచలన ఆరోపణలు చేశారు. మాట్లాడితే ఏపీ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించే కేటీఆర్ రహస్యంగా లోకేష్ తో మూడు సార్లు భేటీ కావాల్సిన అవసరం ఏమి వచ్చింది. ఈ భేటీలో ఏమి మాట్లాడుకున్నారు అన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే సీఎం రేవంత్ రెడ్డి చేసిన రహస్య మీటింగ్ ఆరోపణలపై లోకేష్, కెటిఆర్ ఇద్దరూ స్పందించటం లేదు. దీంతో ఇందులో ఏదో మతలబు ఉండే ఉంటుంది అని చర్చ సాగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేసిన డ్రగ్స్ ఆరోపణలపై సీరియస్ గా స్పందించిన కేటీఆర్ అసలు లోకేష్ తో మీటింగ్ విషయాన్ని మాత్రం ప్రస్తావించటం లేదు. తాను కలవ లేదు అని చెపితే ఆధారాలు భయటపెడతారు అని భయపడి చెప్పటం లేదా...లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక్క కేటీఆర్ మాత్రమే కాదు...నారా లోకేష్ కూడా ఈ విషయంపై ఇప్పటివరకు నోరు విప్పలేదు.
బిఆర్ఎస్ రాజకీయంగా టీడీపీ ని..ముఖ్యం గా ఏపీ సీఎం చంద్రబాబు ను తీవ్రంగా టార్గెట్ చేస్తుంది అనే విషయం తెలిసిందే. ఇప్పుడు బనకచర్ల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చంద్రబాబు కుట్ర చేస్తున్నారు అని బిఆర్ఎస్ నేతలు అంతా మూకుమ్మడిగా ఆరోపిస్తున్నారు. మరి ఇలాంటి తరుణంలో కేటీఆర్ తో రహస్యంగా నారా లోకేష్ తో మూడు సార్లు భేటీ ఎందుకు అయ్యారు అన్నది ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయంగా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో టీడీపీ, జనసేన, బీజేపీ లు కలిసి ఉన్న విషయం తెలిసిందే. త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో వీళ్లిద్దరి మధ్య ఏమైనా చర్చ లు సాగాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయం గా ఇప్పుడు తెలంగాణా లో తీవ్ర ఇరకాట పరిస్థితిని ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ కు ఈ ఉప ఎన్నిక పెద్ద సవాల్ గా మారనుంది.
మరీ ముఖ్యంగా ఇప్పుడు అంతా తానై వ్యవహరిస్తున్న కేటీఆర్ కు ఇది పెద్ద పరీక్షే. ఎందుకంటే కేసిఆర్ బయటకు వచ్చి ఈ ఎన్నిక కోసం ప్రచారం చేస్తారా అన్న అంశంపై కూడా సందేహాలు ఉన్నాయి. మరో వైపు ఈ సీటు లో పోటీ చేసే బీజేపీ కి టీడీపీ, జనసేన లు మద్దతు ఇస్తే ఫలితం ఎలా ఉంటుందో అన్న భయం బిఆర్ఎస్ నేతల్లో ఉంది అని చెపుతున్నారు. మరో వైపు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ఇది తన సీటు కాకపోయినా ఉప ఎన్నికలో ఈ సీటు ను దక్కించుకుంటే పార్టీ కి రాజకీయంగా మరింత జోష్ వస్తుంది అనటంలో సందేహం లేదు. ఈ ఎన్నికలో త్రిముఖ పోటీ ఖాయం, కాంగ్రెస్, బిఆర్ఎస్, బీజేపీ లు బరిలో ఉంటాయి. అయితే బీజేపీ పక్కన టీడీపీ, జనసేన లు కూడా నిలబడితే ఈ రాజకీయం రంజుగా మారుతుంది.



