జగన్ మౌనం ఎందుకు?
ఏపీలో వరస పెట్టి దేవాలయాల్లోని విగ్రహాలపై జరుగుతున్న దాడుల వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. రాజకీయ పార్టీలు అన్నీ ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దేవతా విగ్రహాల దాడుల అంశంపై బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ సునీల్ ధియోధర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతిలో బీజేపీ నిర్వహించిన సభలో సునీల్ ధియోధర్ మాట్లాడుతూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను నియంత్రించడంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఒక్క కేసులో కూడా దోషులను పట్టుకోలేకపోయారని మండిపడ్డారు. సీఎం జగన్ మౌనంగా ఉన్నారంటే ఏమనుకోవాలి? అని సునీల్ ధియోధర్ ప్రశ్నించారు. దేవాదాయ మంత్రిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన నిలదీశారు.
చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 50 ఆలయాలను కూల్చారు.. చంద్రబాబు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని సునీల్ ధియోధర్ ప్రకటించారు. భారతదేశం మొత్తానికి జరిగిన అవమానంగా భావిస్తున్నామని తెలిపారు. జగన్‌ను ఎప్పటికీ క్షమించేది లేదన్నారు. వైసీపీ పాలన నుంచి తప్పుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లా అండ్ ఆర్డర్ అంటే ఏమిటో జనసేన, బీజేపీ చేసి చూపిస్తామన్నారు. తిరుపతి ఎన్నికల్లో బీజేపీ, జనసేన తరపున అభ్యర్థిగా ఎవరు పోటీ చేసినా ప్రధాని మోదీ నిలబడినట్లేనని చెప్పారు. వైసీపీ ప్రజాప్రతినిధుల్లో హిందువులు లేరా... వారి రక్తం ఉడకటం లేదా అని ప్రశ్నించారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికలను ఏసుక్రీస్తు, శ్రీకృష్ణుడి మధ్య పోటీ అంటూ సునీల్ ధియోధర్ పోల్చారు.