Telugu Gateway
Andhra Pradesh

చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా ఆ శాఖ ఆయనకేనా!

చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా ఆ శాఖ ఆయనకేనా!
X

ఎవరికి ఏ శాఖ ఇవ్వాలన్నది పూర్తిగా ముఖ్యమంతి నిర్ణయమే. ఇందులో ఎలాంటి చర్చకు తావు లేదు. కాకపోతే కొన్ని కొన్ని విషయాలు మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. అందుకు ప్రధాన కారణం కొంత మంది విషయంలో ముఖ్యమంత్రి చూపే ప్రత్యేక శ్రద్ద...ఆయనకు కేటాయించిన శాఖల కారణంగానే ఇది తెర మీదకు వస్తుంది. అలాంటిదే ఈ విషయం కూడా. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ లో ఫస్ట్ ఛాన్స్ చంద్రబాబుకే దక్కిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చంద్రబాబు అత్యంత కీలకమైన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖను మంత్రి నారాయణకు కేటాయించారు. అమరావతి నిర్మాణంతో పాటు ఇతర కీలక విషయాలు ఆయనే చూసుకునేవారు. 2024 లో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ముఖ్యమంతి చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ పాత శాఖల్లో కొద్దిగా మార్పులు జరిగాయి కానీ...నారాయణ శాఖ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు. ఇది చూసిన వాళ్ళు అంతా చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా కూడా నారాయణకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్ మెంట్ శాఖ ఏదో కాంట్రాక్టు లాగా ఆయనకు కేటాయిస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 2014 లో తొలి సారి మంత్రి అయిన నారా లోకేష్ ఐటి శాఖ తో పాటు అత్యంత కీలకమైన పంచాయతీ రాజ్ శాఖ ను కూడా నిర్వహించిన విషయం తెలిసిందే.

కాకపోతే ఈ సారి లోకేష్ ఐటి తో పాటు విద్యా శాఖ దక్కింది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు పంచాయతీరాజ్, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖలు దక్కాయి. ముందు నుంచి ప్రచారం జరిగినట్లు పవన్ కళ్యాణ్ ఒక్కరికే డిప్యూటీ సీఎం హోదా దక్కింది. మరో కీలక విషయం ఏమిటి అంటే టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా ఐదేళ్లలో కేవలం రెండు మూడు నెలలు మాత్రమే యాక్టీవ్ గా ఉన్న పయ్యావుల కేశవ్ కు మంత్రి వర్గంలో చోటు కల్పించటమే కాకుండా..ఆర్థిక శాఖతో పాటు వాణిజ్య పన్నులు, శాసనసభ వ్యవహారాల శాఖ కట్టబెట్టారు. క్యాబినెట్ కూర్పుపై టీడీపీ సీనియర్లలో చాలా మంది అసంతృప్తితో ఉన్నా కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థుతుల కారణంగా ఎవరూ నోరు విప్పటానికి సిద్ధంగా లేరు అనే చెప్పాలి. ఎందుకంటే టీడీపీ కి సొంతంగా 135 మంది ఎమ్మెల్యేలు ఉంటే...కూటమిలో ఉన్న జనసేన కు 21 మంది, మరో పార్టీ బీజేపీ కి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే 175 అసెంబ్లీ సీట్లు ఉన్న ఆంధ్ర ప్రదేశ్ లో కూటమికి ఏకంగా 164 సీట్లు ఉన్నాయి. ఈ తరుణంలో ఇప్పుడు ఎవరైనా బయటపడి గొడవ చేసిన ఉపయోగం ఉండదు కాబట్టి అందరూ మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు.

Next Story
Share it