ఛాలెంజ్ చేసింది జనసేన కార్పొరేటరే!
అందరూ కుమ్మక్కు అయి...ల్యాండ్ డీల్ సెటిల్ చేసుకుంటున్నారా!
ఒకటి కాదు...రెండు కాదు. వందల ఎకరాలు. అది కూడా ఒక మాజీ సిఎస్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైజాగ్ లాంటి ప్రాంతంలో బినామీ ల పేరుతో వేల కోట్ల రూపాయల విలువ చేసే వందల ఎకరాలు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి మీడియా లో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత జనసేన కు చెందిన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ కొన్ని వివరాలను ఆధారాలతో సహా బయటపెట్టారు. దీనిపై జగన్ హయాంలో సిఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి సీరియస్ అయి...మూర్తి యాదవ్ కు లీగల్ నోటీసు లు ఇస్తానని హెచ్చరించారు. దీనిపై కూడా మూర్తి యాదవ్ స్పందిస్తూ తాను చెప్పిన వివరాలు తప్పు అయితే బహిరంగ క్షమాపణ చెప్పటం తో పాటు దేనికైనా సిద్ధం అని సవాల్ విసిరారు. విచిత్రం ఏమిటి అంటే అత్యంత కీలకమైన సిఎస్ సీటు లో ఉండి కూడా వేల కోట్ల రూపాయల విలువ చేసే వందల ఎకరాల భూములను మాజీ సిఎస్ జవహర్ రెడ్డి అక్రమంగా దక్కించుకున్నారు అని చెప్పినా కూడా సిఎస్ గా ఉన్న జవహర్ రెడ్డి కనీసం లీగల్ నోటీసు లు ఇవ్వకుండా...మౌనాన్ని ఆశ్రయించటంతో జవహర్ రెడ్డి పైనే అనుమానాలు బలపడ్డాయి.
జవహర్ రెడ్డి వైజాగ్ లోని ఆనందపురం, పద్మనాభపురం మండలాల్లో వందల ఎకరాలను దక్కించుకున్నారు అనే ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆయన తరపున ఈ లావాదేవీలు చేసింది ఉమేష్, త్రిలోక్ అనే వ్యక్తులు అని అప్పటిలోనే పేర్లు కూడా బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు మాజీ సీఎస్ వైజాగ్ ల్యాండ్ స్కాం విషయం అటకెక్కినట్లే కనిపిస్తోంది. వైసీపీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై సిట్ వేశారు. దీంట్లో తప్పు పట్టాల్సింది ఏమి లేదు. మరి వైజాగ్ లో మాజీ సిఎస్ చేసిన భూ దందాపై సిట్ ఎందుకు వేయటం లేదు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం. ఈ విషయంపై జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మౌనంగా ఉండటంపై కూడా పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా హై లైట్ చేసింది జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవే. అయినా సరే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో సైలెంట్ గా ఉండటం వెనక కథ ఏమైనా ఉంటుందా అన్న చర్చ జనసేన వర్గాల్లో కూడా సాగుతోంది. మరో వైపు కూటమి ప్రభుత్వం మాజీ సిఎస్ జవహర్ రెడ్డి అక్రమాల దందాపై యాక్షన్ కంటే సెటిల్మెంట్ వైపే మొగ్గు చూపింది అనే ప్రచారం కూడా అధికార వర్గాల్లో సాగుతోంది.
లేదు అంటే పలు ఆధారాలతో సహా సి ఎస్ గా పని చేసిన వ్యక్తి అక్రమాలు బయటపడితే చర్యలు లేకుండా కూటమి పెద్దలు మౌనాన్ని ఆశ్రయించారు అంటే ఇందులో అందరూ కుమ్మక్కు అయ్యారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అత్యంత కీలకం అయిన జవహర్ రెడ్డి వైజాగ్ ల్యాండ్ స్కాం పై సిట్ వేస్తుందా లేక ఇప్పటిలాగానే మౌనాన్ని ఆశ్రయిస్తుందా అన్నది వేచిచూడాలి. ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ నేతలు కూడా ఇదే అంశంపై పలు మార్లు మీడియా ముందు తాము అధికారంలోకి వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏమి జరగలేదు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే జవహర్ రెడ్డి గోల్ మాల్ లో కూటమి నేతలు కూడా భాగస్వాములు అయినట్లు భావించవచ్చు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.