కాళేశ్వరం మోడల్ ను ఎంచుకున్న కూటమి సర్కారు

అప్పుల ఊబిలో ఉన్న ఎపీకి ఇప్పుడు ఇంత భారీ ప్రాజెక్ట్ అవసరమా?
జీవనాడి పోలవరం రెడీ అవుతున్న సమయంలో ఇంత హడావుడి వెనక ఎజెండా ఏంటి?
పెండింగ్ ప్రాజెక్ట్ లు వదిలి..బనకచర్ల జపం దేనికోసం ?
తెలంగాణ ప్రజలపై కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎంత పెద్ద భారం మోపిందో అందరూ చూశారు. ఈ ప్రాజెక్ట్ వల్ల రైతులకు కలిగే లాభం కంటే ప్రభుత్వ పెద్దలు..కాంట్రాక్టు సంస్థలు భారీగా లబ్దిపొందినట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. కాళేశ్వరం లో కొన్ని బ్యారేజీలు ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయాయి కూడా. వాటిని తిరిగి గాడిన పెట్టాలంటే మళ్ళీ వందల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టాలి. కాళేశ్వరం అనుభవం నుంచి ఏ మాత్రం పాఠాలు నేర్చుకోకుండా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రాష్ట్ర ప్రజలపై పెద్ద ఎత్తున ఆర్థిక బాంబు పెట్టబోతున్నారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఎన్నికల ముందు వరకు అమరావతి, పోలవరం ప్రాజెక్ట్ ల గురించి మాత్రమే మాట్లాడిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జలహారతి..బనకచర్ల ప్రాజెక్ట్ పై ఎక్కడలేని ప్రేమ చూపిస్తున్నారు. దీని వెనక చాలా పెద్ద ఎజెండా ఉంది అన్నది అధికారులు చెపుతున్న మాట.
ఏ ప్రాజెక్ట్ కట్టినా కూడా ఖచ్చితంగా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మనం పెట్టే ఖర్చు ఎంత..వచ్చే లాభం, ప్రయోజనం ఎంత అన్నది ప్రధానంగా చూసుకోవాలి. ఎందుకంటే బనకచర్లపై గుమ్మరించేది ప్రజాధనం కాబట్టి. బిజినెస్ టెర్మినాలజీలో అయితే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మెంట్ (ఆర్ ఓ ఐ ) అని అంటారు. అయితే రైతులకు..ప్రజలకు పెద్ద ఎత్తున ఉపయోగ పడే వాటి విషయంలో పూర్తిగా ఈ లెక్కలు చూడటం కరెక్ట్ కాకపోయినా...ఎలా చూసుకున్నా కూడా బనకచర్ల ప్రాజెక్ట్ మాత్రం ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు అన్నది ఎక్కువ మంది ఇంజనీరింగ్ నిపుణులు చెపుతున్న మాట. కాళేశ్వరం తరహాలో ఈ ప్రాజెక్ట్ ను చేపట్టేందుకు గురువారం నాడు ఏపీ క్యాబినెట్ జలహారతి కార్పొరేషన్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. దీని ద్వారానే బనకచర్ల ప్రాజెక్ట్ కోసం స్పెషల్ పర్పస్ వెహికిల్ (ఎస్పీవి) ఏర్పాటు చేయనున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ వ్యయం ప్రస్తుతానికి 80000 కోట్ల రూపాయలు అని చెపుతూ ఉన్నా ఇది పూర్తి అయ్యే నాటికి కాళేశ్వరం తరహాలో లక్ష కోట్ల రూపాయలు దాటినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అన్నది సాగునీటి శాఖ అధికారులు చెపుతున్న మాట.
చంద్రబాబు సర్కారు ఇప్పుడు తన రొటీన్ అవసరాల కోసమే నిత్యం పెద్ద ఎత్తున అప్పులు చేస్తోంది. ఇవి కూడా రికార్డు స్థాయిలకు వెళుతున్నాయి. ఈ తరుణంలో ..ఇంత ఆగమేఘాల మీద 80000 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో కూడిన ప్రాజెక్ట్ చేపట్టాల్సిన అవసరం ఏముంది అన్నది ఎక్కువ మంది మదిని తొలుస్తున్న సందేహం. మరో వైపు రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరం వచ్చే మూడేళ్ళలో పూర్తి అవుతుంది అని చెపుతున్నారు. అలాంటప్పుడు ఇప్పటికే ప్రారంభించిన ప్రాజెక్ట్ లు పూర్తి చేయటంపై దృష్టి పెట్టి ..తర్వాత బనకచర్లపై ఫోకస్ పెడితే బాగుంటుంది అనేది నిపుణుల సూచన. కానీ ఏపీ లో కూటమి ప్రభుత్వం కొలువుతీరినప్పటి నుంచి తెర వెనక బలమైన శక్తులు పని చేస్తూ బనకచర్ల ప్రాజెక్ట్ ను ముందుకు తెచ్చారు అని చెపుతున్నారు. డీపీఆర్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఏ మెగా కాంట్రాక్టర్ కు వెళుతుందో ఇప్పటికే ఆ శాఖ అధికారులు బహిరంగంగానే చెపుతున్నారు.
విచిత్రం ఏమిటి అంటే డీపీఆర్ తో పాటు బనకచర్ల ప్రాజెక్ట్ కు సంబంధించిన అన్ని విషయాలను ఆ కంపెనీ నే చూసుకుంటుంది అని ఆ శాఖ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సాగునీటి శాఖ ను ఆ కంపెనీ నే నడిపిస్తుంది అనే ప్రచారం సచివాలయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇప్పటికే మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి చేస్తే ప్రభుత్వ పెద్దలు ఎలాంటి ఉపయోగం ఉండదు అని...అదే కొత్తగా ఎనభై వేల కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్ట్ ను పట్టాలు ఎక్కిస్తే అటు కాంట్రాక్టు సంస్థకు..ప్రభుత్వ పెద్దలకు భారీ ఎత్తున ప్రయోజనం ఉంటుంది అని...అందుకే జెట్ స్పీడ్ లో బనకచర్ల జపం చేస్తున్నారు అని ఐఏఎస్ వర్గాలు కూడా వ్యాఖ్యానిస్తున్నాయి.