దీని వెనక మతలబు ఏంటి?

మోడీ సర్కారు ఉండగా ఏమీ కాదు అన్న ధీమానా?
ఐకానిక్ టవర్ల పనులు దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ , ఎల్ అండ్ టి
రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పై అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు అయిన ఎల్ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ వంటి సంస్థల నుంచి ఆయన 145 కోట్ల రూపాయల మేర ముడుపులు తీసుకున్నారు అనే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మొత్తం వ్యవహారంలో షాపూర్జీ పల్లోంజీ కి చెందిన ప్రతినిధులు ఇదే విషయంపై ఐటి శాఖ తో పాటు ఈడీ వాళ్ళ ముందు కూడా అప్పటిలో వాంగ్మూలం ఇచ్చారు అని అధికారులు చెపుతున్నారు. దీని ఆధారంగానే వైసీపీ హయాంలో అసెంబ్లీలోనూ...బయట కూడా చంద్రబాబు పై, చంద్రబాబు పేషిపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అమరావతిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంతో పాటు వందల కోట్ల రూపాయల ఇతర పనులు దక్కించుకున్న సంస్థలు వివిధ రూపాల్లో చంద్రబాబు కు ముడుపులు అందించాయి అని ఐటి విచారణ జరిపిన విషయం తెలిసిందే.
ఇప్పటికీ ఆ కేసు ఇంకా అలాగే ఉంది. దీన్ని ఇంతవరకు క్లోజ్ చేయలేదు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇప్పటి వరకు షాపూర్జీ పల్లోంజీ ని దూరం పెడుతూ వచ్చారు. కానీ సడన్ గా ఈ కంపెనీ మళ్ళీ ఆంధ్ర ప్రదేశ్ లోకి ఎంట్రీ ఇచ్చి వేల కోట్ల రూపాయల పనులు దక్కించుకోవటం అధికార వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే కొన్ని పనులు దక్కించుకున్న షాపూర్జీ పల్లోంజీ ఇప్పుడు ఏకంగా ఐకానిక్ టవర్ల పనులు కూడా పొందటంతో దీని వెనక మతలబు ఏమై ఉంటుందా అన్న చర్చ అధికార, రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇప్పుడు కేంద్రంలోని మోడీ సర్కారులో టీడీపీ కూడా భాగస్వామిగా ఉండటంతోనే తమకు ఏమీ కాదు అనే ధీమాతో చంద్రబాబు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు అని...కాకపోతే ప్రతి విషయం ఢిల్లీలోని బీజేపీ పెద్దల తరపున వాళ్ళ మనుషులు నమోదు చేస్తూనే ఉంటారు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.
ఇవి అన్నీ కూడా వాళ్ళు అవసరం అయినప్పుడు మాత్రమే బయటకు తీస్తారు అని..అప్పటి వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఆయన చెపుతున్నారు. గతంలో ఐటి అధికారులతో పాటు ఇతర విచారణా సంస్థల ముందు పనులు దక్కించుకున్నందుకు ముడుపులు ఇచ్చాం అని చెప్పిన కంపెనీ షాపూర్జీ పల్లోంజీ కి తిరిగి ఏపీలో భారీ ఎత్తున కాంట్రాక్టులు కేటాయిస్తుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఇక్కడ మరో విచిత్రం ఏమిటి అంటే ఇటీవల లంచాలు తీసుకుంటున్నారు అని సిబిఐ అరెస్ట్ చేసిన ఆదాయపన్ను శాఖ కమిషనర్ (మినహాయింపులు) జీవన్ లాల్ అరెస్ట్ అయ్యారు. ఈయన దగ్గరే షాపూర్జీ పల్లోంజీ కేసు కూడా ఉంది ...ఇందులో ఆ కంపెనీ ప్రతినిధి కూడా అరెస్ట్ అయినట్లు వార్తలు వచ్చాయి.