నాలుగు వందల సీట్లు గెలిచే పార్టీ..ఇలా ఎందుకు?
లోక్ సభ ఎన్నికల ముందు ఇండియా కూటమి కకావికలం అవుతోంది. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉత్తరాదిలో బీజేపీ కి ఎంతో కొంత కలిసి వచ్చే అంశం. ఒక వైపు ప్రధాని మోడీ వచ్చే ఎన్నికల్లో తమకు ఏకంగా 400 సీట్లు వస్తాయని చెపుతున్నారు. అందులో బీజేపీ కే 370 సీట్లు...మొత్తం ఎన్ డిఏ కి కలుపుకుని నాలుగు వందల సీట్లు అని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. జాతీయ స్థాయి మీడియాతో పాటు ప్రాంతీయ మీడియా లు సైతం మళ్ళీ మోడీ...మూడవ సారి కూడా మోడీ నే వస్తారు అని బలంగా నమ్ముతున్నారు...ప్రచారం చేస్తున్నారు. మరి ఈ తరుణంలో బీజేపీ అకస్మాత్తుగా ఆంధ్ర ప్రదేశ్ లోని తెలుగు దేశం అధినేత చంద్రబాబు ను ఢిల్లీ కి పిలిపించుకుని చర్చలు జరపటం వెనక అసలు కారణం ఏమిటి అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతున్న అంశం. నాలుగు వందల సీట్లు గెలిచే జోష్ లో ఉన్న బీజేపీ అసలు చంద్రబాబు గురించి ఆలోచిస్తోందా అన్నది ఎక్కువ మందిలో అనుమానాలు రేపుతున్న అంశం. లేక దీని వెనక బీజేపీ కి తెర వెనక ఉండి పూర్తిగా స్థాయి మద్దతు అందిస్తున్న జగన్ బాబు కు మేలు చేసే కుట్ర ఏమైనా ఉందా అన్న చర్చ కూడా ఆంధ్ర ప్రదేశ్ నేతల్లో సాగుతోంది. అయితే ఇక్కడ అత్యంత కీలకమైన అంశం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేనలు బీజేపీ కి మద్దతు ఇస్తున్న పార్టీ లే. నిజంగా ఆంధ్ర ప్రదేశ్ ఫలితాలు జాతీయ స్థాయిలో బీజేపీ పై పెద్దగా ప్రభావం చూపించే అవకాశమే లేదు.
నంబర్ల ఆటలో ఏ పార్టీ అయినా ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నా జాతీయ స్థాయిలో అప్పటి పరిస్థితి ని బట్టి నిర్ణయాలు తీసుకుంటాయి. ప్రస్తుతం మళ్ళీ మోడీ వస్తారనే అంచనాలతో ఆంధ్ర ప్రదేశ్ లోని పార్టీ లు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం చేయటం లేదు. నిన్న మొన్నటి వరకు టీడీపీ కీలక నేతలు అందరూ కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉండే ఛాన్స్ లేదు అని బలంగా నమ్మారు. కానీ సడెన్ గా అమిత్ షా పిలుపు మేరకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లినట్లు టీడీపీ నేతలు అధికారికంగా ప్రకటించారు. మోడీ తీరుతో పలు ప్రాంతీయ పార్టీ లు గత పదేళ్ల కాలంగా బీజేపీ కి దూరం అయ్యాయి. అందుకే గత కొంత కాలంగా ఆర్ఎస్ఎస్ పలు రాష్ట్రాల్లో బలంగా ..పట్టున్న ప్రాంతీయ పార్టీలను తిరిగి ఎన్ డిఏ గూటికి తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నట్లు బీజేపీ వర్గాలు చెపుతున్నాయి. అందులో భాగంగానే ఇప్పుడు చంద్రబాబు వంటి నేతలకు పిలుపు వచ్చింది అన్నది కొంతమంది నేతల వాదన. అయితే బీజేపీ తో పొత్తు వాళ్ళ లాభం కంటే నష్టమే ఎక్కువ ఉండే అవకాశం ఉంది అనే భయం కొంత మంది టీడీపీ నేతల్లో ఉంది. చంద్రబాబు నాయుడు ఢిల్లీ లో కేంద్ర హోంమంత్రి అమిత షా , బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా తో భేటీ అయి వచ్చిన వెంటనే వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవటం కూడా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.