ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ..టిసిఎస్..లులూ..అదే మోడల్

ఉర్సా క్లస్టర్స్ పెట్టి రెండు నెలలే...ఆ కంపెనీకి వెయ్యి కోట్ల విలువైన భూమి!
దేశంలోనే నంబర్ వన్ ఐటి కంపెనీ టిసిఎస్. ఆ బ్రాండ్ కే ఎంతో విలువ ఉంటుంది. టిసిఎస్ లాంటి సంస్థ ఆంధ్ర ప్రదేశ్ కు ..అది కూడా వైజాగ్ కు రావటం ఖచ్చితంగా మంచి శుభవార్త. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. టిసిఎస్ వంటి కంపెనీ వైజాగ్ లో క్యాంపస్ ఏర్పాటు చేయటం వల్ల ఇతర దిగ్గజ సంస్థలు కూడా ఈ దిశగా చూసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం పరిగణన లోకి తీసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే 2025 మార్చి తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఈ కంపెనీకి వచ్చిన నికర లాభం 48554 కోట్ల రూపాయలు. ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలోనే అంటే కేవలం మూడు నెలల కాలంలో ఈ కంపెనీ సాధించిన నికర లాభం 12224 కోట్ల రూపాయలు. ఇంతటి భారీ లాభాలు గడిస్తున్న టాటా గ్రూప్ కు చెందిన ఈ కంపెనీ ప్రభుత్వం నుంచి వందల కోట్ల రూపాయల విలువైన భూమిని ఏదో చౌక ధరకు కొట్టేయాలని అనుకోదు. మంగళవారం నాడు ఆంధ్ర ప్రదేశ్ కాబినెట్ టిసిఎస్ వైజాగ్ లో 22 . 6 ఎకరాలను ఎకరా 99 పైసల లెక్కనే..మొత్తం 22 ఎకరాలను 99 పైస లకు విక్రయించింది. లీజ్ కూడా కాదు. ఏకంగా విక్రయమే. ఈ భూమి విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుంది.
ఈ కంపెనీ వైజాగ్ లో క్యాంపస్ ఏర్పాటు కోసం 1370 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి ..12000 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. అయితే మూడు నెలల కాలానికే ఏకంగా పది వేల కోట్ల రూపాయలు నికర లాభం గడించే కంపెనీకి ఇంత కారు చౌకగా భూములు కేటాయించాల్సిన అవసరం ఉందా అన్న చర్చ అధికార వర్గాల్లో సాగుతోంది . ఇది అంతా చూస్తుంటే రాష్ట్ర సంపదను ప్రవేట్ కంపెనీలకు దోచిపెట్టి ఇవి తమ వల్లే వచ్చాయనే ప్రచారం చేసుకుని తమ బ్రాండ్ వల్లే టిసిఎస్ తో పాటు ఇతర పెట్టుబడులు వచ్చాయని అటు చంద్రభాను, ఇటు నారా లోకేష్ లు చెప్పుకుంటున్నారు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అభిప్రాయపడ్డారు . ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ కు కల్పించిన అదనపు రాయితీలు ...వేల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని లులూ మాల్ కు కట్టబెట్టడం వంటి అంశాలు చూస్తే వీటి వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం కంటే...రాష్ట్రం వల్ల ఆయా కంపెనీలకు కలిగే మేలు ఎక్కువ అనే అభిప్రాయాన్ని అధికారులు కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఒక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదరిక నిర్మూలన కోసం సంపన్నులు ముందుకు రావాలని పిలుపునిస్తారు. దీనికోసం ఆయన పీ 4 అనే కాన్సెప్ట్ ను కూడా తెరమీదకు తెచ్చిన విషయం తెలిసిందే. కానీ మరో వైపు రివర్స్ లో రాష్ట్రానికి చెందిన వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమిని కారు చౌకగా ప్రైవేట్ సంస్థలకు కేటాయిస్తూ పోతున్నారు. అంటే రాష్ట్ర సంపదను ప్రవేట్ వ్యక్తలకు కట్టబెట్టి...తమ వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయనే ప్రచారం చేసుకోవటం లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లు ఉన్నారు అని అధికార వర్గాలు చెపుతున్నాయి. రెండు నెలల క్రితం పుట్టిన చింతా గ్రీన్ ఎనర్జీ కి రాష్ట్రంలో ఏకంగా పది వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చిన తరహాలో..ఇప్పుడు ఇదే మోడల్ లో ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు వైజాగ్ లో రెండు చోట్ల కలుపుకుని దగ్గర దగ్గర అరవై ఎకరాలు కేటాయించారు. ఈ భూమి విలువే ఏకంగా వెయ్యి కోట్ల రూపాయలు ఉంటుంది అని ఒక అంచనా. అంటే ఈ కంపెనీ పెట్టి రెండు నెలలు కాలేదు కానీ...ఈ సంస్థకు మాత్రం వెయ్యి కోట్ల రూపాయల విలువ చేసే భూమి కేటాయించారు ఐటి ప్రాజెక్ట్ ల పేరుతో. ఇదే చంద్రబాబు, నారా లోకేష్ ల డెవలప్ మెంట్ మోడల్.