కొంత మంది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపే!
వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏ మీటింగ్ చూసినా ఆ పాయింట్స్ మాత్రం కామన్. నాకు చంద్రబాబుకు లాగా ఈనాడు మద్దదు ...ఆంధ్ర జ్యోతి అండ లేదు. టీవీ 5 సపోర్ట్ లేదు. నాకు ఉన్నదల్లా మీరే అంటూ ప్రజలనుద్దేశించి జగన్ చెప్పే డైలాగులు ఇప్పుడు చిన్న పిల్లలు కూడా కళ్ళు మూసుకుని చెప్పే పరిస్థితికి వచ్చేశారు. ఎందుకంటే అయన ఏ మీటింగ్ అయినా ఈ డైలాగులు కామన్ కనుక. సీఎం జగన్ ఎప్పుడు తన ఫ్యామిలీకి చెందిన సాక్షి పేపర్, సాక్షి టీవీల గురించి కూడా చెప్పుకోరు. ఎందుకో ఇది వెరైటీ. జగన్ చెప్పే డైలాగులు నిజామా కాదా అనే విషయాన్నీ కాసేపు పక్కన పెడదాం. ఒక ముఖ్యమంత్రి. అది కూడా ఏకంగా 151 సీట్లతో గత నాలుగున్నరేళ్లుగా పాలన సాగిస్తున్న అయన చంద్రబాబు పక్కన ఏ మీడియా ఉందో చెపుతూ వస్తున్నారు. కానీ తన వైపు ఉన్న వారి పేర్లు మాత్రం ప్రస్తావించటం లేదు. సాక్షి పేపర్ ,సాక్షి టీవీ ఎలాగు ఫ్యామిలీ వ్యవహారమే కాబట్టి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ జగన్ పేరు చెప్పటానికి ఇష్టపడని కీలక చానల్స్ అన్నీ అయనకు మద్దతు ఇస్తున్న విషయాన్నీ చెప్పకనే చెపుతున్నట్లు అవుతుంది అనే చర్చ సాగుతోంది.
చంద్రబాబు పక్కన ఎవరు ఉన్నారో జగన్ స్పష్టంగా చెపుతున్నారు. అదే సమయంలో కీలక మీడియా సంస్థల పేర్లను అలా వదిలేశారు కాబట్టి వారు అంతా జగన్ ఖాతాలో ఉన్నట్లు స్పష్టం అవుతూనే ఉంది. జగన్ ఎంత సేపూ తన వైపు లేని వారి గురించే చెపుతున్నారు కానీ...తన వైపు ఉన్న వారి గురించి మాట మాత్రంగా కూడా ప్రస్తావించటం లేదు. అలా ఉన్న వాళ్ళు జగన్ కు మద్దతుగా నిలవటమే కాదు...ప్రత్యర్థులపై బురద కూడా చల్లుతున్నారు. ఒకటి మాత్రం నిజం. మీడియాలు పార్టీలు వారిగా చీలిపోయాయి. వాటిని చూసేవాళ్లకు ఆ విషయం స్పష్టంగా తెలుసు. మరికొంత మంది మాత్రం అడ్డా కూలీల తరహాలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్లకు పక్కకు జంప్ అయిపోతూ వ్యాపారాలను కొత్త కొత్త పుంతలు తొక్కించుకుంటున్నారు. అడ్డా కూలీలు ఎవరు పిలిస్తే వారి దగ్గరకు పనికి వెళతారు...కొన్ని కీలక చానళ్ళు మాత్రం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరకు వెళతారు. రాజకీయ నాయకుల ఫిరాయింపుల తరహాలో వీళ్లకూ పెద్దగా పట్టింపులు ఏమి ఉండవు. వాళ్లకు కావాల్సింది అల్లా అధికారానికి దగ్గరగా ఉండటం...వ్యాపార ప్రయోజనాలు కాపాడుకోవటం అంతే.