Telugu Gateway
Andhra Pradesh

ఐకానిక్ టవర్స్ టెండర్లు ఎందుకు ఆగాయి ?!

ఐకానిక్ టవర్స్ టెండర్లు ఎందుకు  ఆగాయి ?!
X

ఎవరి అత్యాశ ఐకానిక్ టవర్ల టెండర్లకు బ్రేకులు వేసింది. కంపెనీలదా...ప్రభుత్వంలోని పెద్దలదా?. ఇదే ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అధికార వర్గాల్లో హాట్ టాపిక్. రాజధాని టవర్ లు ఎంత ఎత్తుకు వెళ్లినా పర్వాలేదు కానీ..వీటి పేరుతో సాగుతున్న అవినీతి కూడా కొత్త కొత్త ఎత్తులకు చేరుతోంది అనే విమర్శలు అధికార వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. స్థలం లేకుండా కేవలం నిర్మాణ వ్యయమే చదరపు అడుగుకు తొమ్మిదివేల రూపాయల ధర నిర్ణయించటం చూసి ఐఏఎస్ అధికారులు ..ఇంజినీర్లు అవాక్కు అయ్యారు. ఈ విచిత్రం చోటు చేసుకున్నది ఆంధ్ర ప్రదేశ్ రాజధానిలోని సచివాలయం నిర్మాణానికి సంబంధించిన విషయంలో. ఎలాంటి వివాదాలు లేకుండా అమరావతి ప్రాజెక్ట్ పూర్తి కావాలని రాజధాని రైతులు..ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు కోరుకుంటుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారాయణ, సిఆర్ డీఏ అధికారులు మాత్రం నిత్యం ఈ టెండర్ల వ్యవహారాన్ని వివాదాల్లోకి నెడుతున్నారు.

అదే సమయంలో పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం ఇచ్చేలా చేస్తున్నారు అనే విమర్శలను మూట కట్టుకుంటున్నారు. ముందు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఈ ప్రతిష్టాత్మకమైన ఐకానిక్ టవర్ల టెండర్లు మే 2 నాటికి ఖరారు కావాల్సి ఉంది. కానీ వీటిని ఏదో కారణంతో మే ఏడవ తేదికి వాయిదా వేశారు. మే 23 వచ్చింది కానీ..ఇప్పటి వరకు అమరావతిలో అత్యంత ముఖ్యమైన సచివాలయం పనులు అంటే ఈ ఐకానిక్ టెండర్ల విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు. దీనికి కారణం ఏంటి అంటే ఇందులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులు ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టి తో పాటు ఇతర కీలక సంస్థలు అయిన షాపూర్జీ పల్లోంజీ, ఎన్ సిసి లకు దక్కినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే చిక్కు ఎక్కడ వచ్చింది అంటే అసలు అంచనాల ఖరారు సమయంలో ఈ టవర్ల నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు ఏకంగా తొమ్మిది వేల రూపాయలుగా ఫిక్స్ చేయటం దుమారం రేపుతుంటే..ఇంత ధర ఇచ్చినా వాటిలో కూడా కంపెనీ లు ఎక్సెస్ కు టెండర్లు దాఖలు చేయటంతో వీటిని ఆమోదించటం సర్కారు కు పెద్ద తలనొప్పిగా మారినట్లు అధికార వర్గాలు చెపుతున్నాయి.

ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం రాష్ట్రంలో చేపట్టే ఏ పనుల్లో అయినా ఐదు శాతానికి మించి ఎక్సెస్ అనుమతించకూడదు. కానీ అమరావతి పనుల్లో నిబంధనలు తుంగలో తొక్కి..ప్రభుత్వం తన జీవో ను తానే ఉల్లఘించి బిఎస్ఆర్ ఇన్ఫ్రా తో పాటు ఇతర సంస్థలు కొన్నింటికి ఎనిమిది శాతం పైన ఎక్సెస్ కు అనుమతించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐకానిక్ టవర్ల టెండర్ల విషయంలో కూడా కొన్ని కంపెనీలు సీలింగ్ కు మించి ఎక్సెస్ వేశాయి అని...అందుకే వీటికి ఎలా ఆమోదం తెలపాలో అర్ధం కాక అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి కొద్ది రోజుల క్రితమే సిఆర్ డీఏ సమావేశం జరిగి అందులో ఈ టెండర్లను ఫైనల్ చేయాల్సి ఉంది. కానీ ఈ ఎక్సెస్ విషయం ఇప్పుడు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారినట్లు కనిపిస్తోంది అని ఒక అధికారి తెలిపారు. ఇచ్చిన రేట్లే అడ్డగోలుగా ఉంటే మళ్ళీ అందులో కూడా ఎక్సెస్ అనుమతించారు అంటే ప్రభుత్వం రాజధాని పనులు పూర్తి చేయటం కోసం పని చేస్తుందా లేక వేరే లక్ష్యాలతో పని చేస్తుందా అన్న అనుమానాలు ప్రజల్లో రావటం ఖాయం. ప్రస్తుతానికి ఈ ఐకానిక్ టవర్ల టెండర్లు ఎప్పుడు అధికారికంగా ఖరారు చేస్తారు అనే విషయంలో స్పష్టత లేదు అని అధికారులు చెపుతున్నారు.

ఏపీసిఆర్ డీఏ గత నెలలో ఈ ఐదు టవర్ ల నిర్మాణాన్ని టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. జీఏడి టవర్ గా పిలిచే ప్రధాన టవర్ లో ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు ఇతర ఆఫీస్ లు ఉంటాయి. ఈ ఒక్క టవర్ నిర్మాణ వ్యయం 1126 కోట్ల రూపాయలుగా ఉంది. సచివాలయంలో భాగంగా నిర్మించే టవర్ 1 , 2 ల నిర్మాణ వ్యయం 1897.86 కోట్లు, టవర్ 3 , 4 ల నిర్మాణ వ్యయం 1664 కోట్ల రూపాయలుగా ఉంది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ పేరుతో నిర్మించనున్న ఈ ఐదు టవర్లు కలుపుకుంటే మొత్తం నిర్మాణ వ్యయం 4668 .82 కోట్ల రూపాయలు కానుంది. అంచనా విలువ కంటే కంపెనీలు ఎక్సెస్ ధరలు కోట్ చేయటంతో ఈ వ్యయం ఎంతకు చేరుతుందో చూడాలి.

Next Story
Share it