Telugu Gateway
Andhra Pradesh

ఈ లెక్కల్లో వైసీపీ గెలుపు కష్టమే!

ఈ లెక్కల్లో వైసీపీ గెలుపు కష్టమే!
X

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో గెలిచేది ఎవరు?. ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ..విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు కూడా ఫోన్లు చేసి మరీ ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. ఎన్నికలు మే 13 న ముగిసినా ఫలితాల కోసం జూన్ నాలుగు వరకు ఎదురుచూడాల్సిందే. అంటే ఇంకా 21 రోజుల తర్వాత కానీ అసలు సిసలు ఫలితాలు వెల్లడికావు. అయితే జూన్ 1 న వెల్లడి అయ్యే ఎగ్జిట్ పోల్స్ లో కూడా కొంత మేర స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటారు. ఉహల పల్లకిలో విహరిస్తూనే ఉంటారు అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుత ఓటింగ్ శాతం...గెలువు అవకాశాలపై చర్చించుకునే ముందు గత ఎన్నికల లెక్కలను కూడా ఒక సారి చూడాల్సి ఉంటుంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ నడిచినా కూడా టీడీపీ ఒంటరిగానే దగ్గర దగ్గర 40 శాతం ఓట్లు తెచ్చుకుంది. ఈ ఐదేళ్ల కాలంలో ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీ పై వ్యతిరేకత పెంచే అంశాలు చాలా చాలా పరిమితంగానే ఉంటాయని చెప్పాలి. అదే అధికార వైసీపీ దగ్గరకు వచ్చేటప్పటికి ప్రభుత్వంపై వ్యతిరేకత కు చాలా చాలా కారణాలే ఉన్నాయని చెప్పొచ్చు.

గత ఎన్నికల తరహాలోనే ఈ సారి కూడా ఆంధ్ర ప్రదేశ్ లో దగ్గర దగ్గర 80 శాతం వరకు పోలింగ్ నమోదు అయ్యే అవకాశం ఉంది. తుది లెక్కలు ఇంకా రావాల్సి ఉంది. అయితే గత ఎన్నికల్లో సమాజంలోని అన్ని సెక్షన్స్ కూడా జగన్ వైపు మొగ్గు చూపాయి. అందుకు కారణాలు ఎన్నో. అప్పటి చంద్రబాబు పాలనపై వ్యతిరేకత ఒకటి...జగన్ ఒక్క ఛాన్స్ నినాదం కూడా పని చేసింది. కానీ ఈ సారి ఆ పరిస్థితి లేదు అని స్పష్టంగా చెప్పొచ్చు. జగన్ కూడా ఎంత సేపూ తనకు పథకాల లబ్ధిదారులు ఉంటే చాలు...మా ఓటు బ్యాంకు వాళ్ళే అన్నట్లు ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి జగన్ కు వ్యతిరేకంగా మారిన సెక్షన్స్ లో అత్యంత ప్రధానమైన వాళ్లలో ప్రభుత్వ ఉద్యోగులు, నిరుద్యోగ యువత, మధ్య తరగతి, మందుబాబుల తో పాటు వివిధ వర్గాల వారు ఉన్నారు. మరో వైపు లబ్ధిదారులు అందరూ కూడా ఏకపక్షంగా వైసీపీ కి ఓటు వేసిన పరిస్థితులు లేవు...ఇందులో కూడా చీలిక వచ్చింది అని క్షేత్ర స్థాయి పరిస్థితులను పరిశీలించిన వాళ్ళు చెపుతున్నారు. ఓటింగ్ ముగిసిన తర్వాత మీడియా తో మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి తమకు సానుకూల ఓటింగ్ నమోదు అయింది అని..మళ్ళీ తాము అధికారంలోకి వస్తామని ప్రకటించారు.

అయితే అసలు వైసీపీ కి సానుకూల ఓటింగ్ ఎక్కడ నుంచి వస్తది అన్నదే ప్రధాన ప్రశ్న. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారం మొత్తంలో ఫోకస్ అంతా కూడా డీబీటీ ద్వారా లబ్ధిపొందిన వాళ్లపైనే పెట్టారు తప్ప మిగిలిన సెక్షన్స్ అంతా రాష్ట్ర పౌరులే కాదు... అసలు వాళ్ళు తమ ఓటు బ్యాంకు కాదు అన్నట్లు వ్యవహరించారు. అలాంటప్పుడు ఒక్క లబ్ధిదారుల సెక్షన్ తప్ప వైసీపీ కి సానుకూల ఓటింగ్ ఎక్కడ నుంచి వస్తుంది అనే ప్రశ్న ఉదయించటం సహజం. మరో వైపు ఈ ఎన్నికల్లో టీడీపీ, జన సేన, బీజేపీ లు కూటమి కట్టినా కూడా ప్రధానంగా ఓటు బ్యాంకు ఉన్నది టీడీపీ, జన సేనలకు మాత్రమే. బీజేపీ ఓటు బ్యాంకు పరిమితం అనే విషయం తెలిసిందే. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో టీడీపీ, జన సేన కూటమి బాగా వర్క్ అవుట్ అయిన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో పాటు జగన్ పై వివిధ వర్గాల్లో ఉన్న వ్యతిరేకత కూటమికి బాగా కలిసి వచ్చింది.

మరో కీలక విషయం ఏమిటి అంటే గత ఐదేళ్ల కాలంలో పోలీసులకు బయపడి ఉన్న టీడీపీ నాయకులు...క్యాడర్ కూడా ఎన్నికల రోజు పలు చోట్ల తిరగబడి పోరాటం చేయటం కూడా ఒక స్పష్టమైన సంకేతంగా భావిస్తున్నారు. డబ్బు విషయంలో కూడా కూటమి అభ్యర్థులు చాలా చోట్ల అధికార వైసీపీ కి సమానంగా పంపిణి చేసినట్లు చెపుతున్నారు. ఎలా చూసుకున్నా కూడా వైసీపీ నేతలు చెపుతున్నట్లు మరో సారి వైసీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు అన్నది క్షేత్రస్థాయి నుంచి వస్తున్న సమాచారం. ఈ ఎన్నికల్లో కూటమి స్పష్టమైన మెజారిటీ తో ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. అయితే అధికారిక ఫలితాలు వచ్చే వరకు ఈ సస్పెన్స్ తప్పదు అనే చెప్పాలి.

Next Story
Share it