Telugu Gateway
Andhra Pradesh

హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం

హాట్ టాపిక్ గా మారిన వ్యవహారం
X

గతంతో పోలిస్తే కూటమి ప్రభుత్వంలో ఈ సారి ఎన్నో ఎన్నో వింతలు చోటు చేసుకుంటున్నాయి. కొత్త కొత్త పోకడలు వస్తున్నాయి. ఇవి అన్నీ చూసి టీడీపీ నేతలు కూడా అవాక్కు అవుతున్నారు. ఎందుకంటే గతానికి భిన్నంగా పార్టీలో ...ప్రభుత్వంలో చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (ఏపీఎస్ డీపీఎస్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న వీ ఆర్ ఆలపర్తి ప్రభుత్వంలో చేస్తున్న హడావుడి చూసి ఐఏఎస్ అధికారులతో పాటు టీడీపీ నేతలు కూడా అవాక్కు అవుతున్నారు. అసలు ఎవరు ఈయన..ఈయనకు ప్రభుత్వంలో ఎందుకింత ప్రాధాన్యత అన్నది ఎవరికి అంతు చిక్కటం లేదు. అయితే ఆయన అసలుపేరు వెంకటేశ్వరరావు ఆలపర్తి అయితే ఎక్కువగా వీఆర్ ఆలపర్తిగా ప్రచారంలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్...ఆయన కుటుంబ సభ్యులకు కూడా తాను ఎంతో దగ్గర అని చెపుతూ ఐఏఎస్ అధికారుల దగ్గర...ప్రభుత్వంలో పెద్ద ఎత్తున హవా చెలాయిస్తున్నట్లు టీడీపీ వర్గాలు చెపుతున్నాయి.

అంతే కాదు అయన కొన్ని సందర్భాల్లో ఐఏఎస్ అధికారులపై కూడా పెత్తనం చెలాయించేలా వ్యవహరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏ పనికి అయినా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు..లేదు అంటే ఆయన కుటుంబ సభ్యుల పేర్లు చెపుతారు అని ఒక ఐఏఎస్ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంలో ఆయన పేదరిక నిర్ములన సర్వేలు చేయించటంతో పాటు పీ 4 కి సంబంధించిన వివిధ కార్యక్రమాలు చూస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అంతే కాదు నియోజవర్గాల వారీగా పరిస్థితిని మదింపు చేసేందుకు నియోజవర్గానికి ఒక్కరు లెక్కన 175 మంది ఎంబీఏ గ్రాడ్యుయేట్ల నియామకం విషయంలో కూడా పెద్ద ఎత్తున గోల్ మాల్ కు పాల్పడినట్లు అధికారులు చెపుతున్నారు. ఇదే అదనుగా ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

కెరీర్ ఎక్కడ మొదలు పెట్టారు అంటే?!

ప్రస్తుతం ప్రభుత్వంలో మేనేజ్ మెంట్ నిపుణుడిగా హడావుడి చేస్తున్న ఆయన గతంలో రామోజీ గ్రూప్ సంస్థల్లో పనిచేశారు. అది కూడా సినిమా నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలను చూస్తుండే వారు అని...రకరకాల ఆరోపణలతో అక్కడ నుంచి ఉద్యోగం నుంచి తొలగించారు అని టీడీపీ నేతలు చెపుతున్నారు. ఆ తర్వాత టీడీపీ మాజీ ఎంపీ సిఫారసుతో ఏపీఎండీసి లో కాంటాక్ట్ ఉద్యోగిగా చేరారు. అక్కడ కూడా పలు ఆరోపణలతో ఆయన వేటు పడినట్లు చెపుతున్నారు. తర్వాత ఐఐఎం అహ్మదాబాద్ లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగంలో చేరి అక్కడ నుంచి పెంచుకున్న పరిచయాలతో వివిధ ఏజెన్సీల నుంచి సర్వే రిపోర్ట్ లు తెప్పించుకుని వాటిని చంద్రబాబునాయుడికి అందివ్వటం ద్వారా ఆ టీంలో పాగావేసి ఇప్పుడు ప్రభుత్వంలో హవా చెలాయిస్తున్నట్లు చెపుతున్నారు.

అయితే కొన్ని సార్లు ఇక్కడ నుంచి సమాచారం బయటకు పోతుంది అని కొంత మంది టీడీపీ నేతలు చెపుతున్నారు. అలపర్తి చేస్తున్న వ్యవహారాలపై ప్రభుత్వ పెద్దలు దృష్టి పెడితే ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయని పార్టీ నేతలు వ్యాఖ్యనిస్తున్నారు. విచిత్రం ఏమిటి అంటే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ ల మధ్య సహకారాన్ని పెంచుకునేందుకు అంటూ ఏర్పాటు చేసిన జాయింట్ ఇంప్లీమెంటేషన్ కమిటీలో సభ్యుడిగా చంద్రబాబు సర్కారు ఏ ఆర్ ఆలపర్తిని నియమించింది. ఈ నియామకంపై కూడా అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసలు ఒక వైపు సింగపూర్ ప్రభుత్వం తాను ఏది అడిగితే అది చేస్తుంది అని చెప్పుకుంటూ ఈ నియామకాలు చేపట్టడం వింతగా ఉంది అని ఐఏఎస్ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it