Telugu Gateway
Andhra Pradesh

మళ్లీ మళ్లీ అదే సీన్

మళ్లీ మళ్లీ అదే సీన్
X

టాలీవుడ్ లోని టాప్ హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. నిజంగా అయన రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఆ మాట అయనే నేరుగా చెపుతారు. ఒకప్పుడు టీడీపీ లో చురుగ్గా ఉన్న ఎన్టీఆర్ కారణాలు ఏమైనా కూడా పక్కకు తప్పుకుని ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టారు. ప్రస్తుతం రాజకీయాలకు ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నా నిత్యం ఏదో ఒకరకంగా అయన పేరు మాత్రం రాజకీయాల్లో వినిపిస్తూనే ఉంటుంది. విచిత్రం ఏమిటి అంటే ఇందులో నేరుగా ఎక్కడ ఎన్టీఆర్ ప్రమేయం ఉండదు. కొన్నిసార్లు ఎన్టీఆర్ అభిమానులు హడావుడి చేస్తారు...మరికొన్ని సార్లు ఆంధ్ర ప్రదేశ్ లో అధికార వైసీపీ కి చెందిన నాయకులు కావాలనే ఎన్టీఆర్ పేరును తెరమీదకు తీసుకువస్తారు. ఈ జాబితాలో మాజీ మంత్రి కొడాలి నాని తో పాటు లక్ష్మి పార్వతి వంటి వారు ఉంటారు. వీళ్ళిద్దరూ ఎన్టీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే టీడీపీ కి మళ్ళీ పునర్వైభవం వస్తుంది అని ప్రకటిస్తుంటారు. వీళ్లిద్దరి మాటలు నిజమే అనుకుంటే...టీడీపీ కి పునర్వైభవం అంటే...ఏ పార్టీ కి అయినా అధికారంలోకి రావటం అని చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళు వైసీపీ ని ఓడించటానికి ఎన్టీఆర్ టీడీపీ లోకి రావాలని కోరుతున్నారా అనే ప్రశ్న ఉదయించటం ఖాయం. అయితే వాళ్ళ పర్పస్ అది కాదు...ఇప్పటిలో ఎన్టీఆర్ఎ రాజకీయాల్లోకి రారు అని వాళ్లకు తెలుసు..అయినా ఎన్టీఆర్ పేరును తెరమీదకు తెచ్చి టీడీపీ లో ఒక రకమైన చర్చ కొనసాగించటం వైసీపీ టార్గెట్.

తాజాగా ఇప్పుడు మరో సారి అదే జరిగింది. ప్రకాశం జిల్లాలో ఒక వైపు నారా లోకేష్ పాదయాత్ర జరుగుతున్న వేళ వ్యూహాత్మకంగా నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్. అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే అంటూ ఒక స్లోగన్ తో రాత్రికి రాత్రి ఫ్లెక్సీలు పెట్టారు . వాటిపై దివంగత ఎన్టీఆర్ తో పాటు చంద్రబాబు ఫోటో లు ఒక పక్క...మరో వైపు ఎన్టీఆర్ ఫోటో పెట్టారు. దీంతో ఇవి అందరి దృష్టిని ఆకర్షించటంతో పాటు మీడియా లో కూడా చర్చకు కారణం అయ్యాయి. దీనిపై మాజీ ఎమ్మెల్యే, పార్టీ వైస్ ప్రెసిడెంట్ దామచర్ల జనార్దన్ స్పందించారు. ఇది అంతా ఐ ప్యాక్ , వైసీపీ కుట్రతోనే జరిగింది అని ఆరోపించారు. చంద్రబాబు సభల్లో కూడా కొన్నిసార్లు ఎన్టీఆర్ ఫ్లెక్సీలతో హంగామా జరిగిన విషయం తెలిసిందే. ఇవి అన్నీ చూస్తుంటే వచ్చే ఎన్నికల వరకు ఇలా ఎవరో ఒకరు ఎన్టీఆర్ పేరును ఇలా రాజకీయాల్లోకి లాగుతూనే ఉంటారు అనే విషయం స్పష్టం అవుతోంది. ప్రస్తుతం ఒక వైపు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దేవర తో పాటు బాలీవుడ్ లో వార్ -2 సినిమాలో మరో హీరో హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే.

Next Story
Share it