Telugu Gateway
Andhra Pradesh

ఇప్పుడు అసలు కంటే మరి కొసరుకే ఎక్కువ !

ఇప్పుడు అసలు కంటే మరి కొసరుకే  ఎక్కువ !
X

మాట్లాడతారా ...మౌనంగానే ఉంటారా? !

అసలు కంటే కొసరు ఎక్కువా?. గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ కోసం అని చెప్పి రైతుల దగ్గర నుంచి దగ్గర దగ్గర 35 వేల ఎకరాల భూమి సమీకరించిన ప్రభుత్వం ఇప్పుడు అమరావతి విస్తరణ కోసం అంటూ ఏకంగా 45 వేల ఎకరాలు సమీకరించాలని ప్రతిపాదించటం దుమారం రేపుతోంది. గతంలో రాజధానికి 35 వేల ఎకరాల భూ సమీకరణ/సేకరణ ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎలాంటి స్టాండ్ తీసుకుంటారు. అసలు రాజధానికి 33 వేల ఎకరాలు అవసరం ఉందా అని ఆయన గతంలో ప్రశ్నించారు. మరి ఇప్పుడు ఆయన ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి సర్కారులో ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతల్లో ఉన్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమరావతి విస్తరణ అంటూ కొత్తగా 45 వేల ఎకరాలు సమీకరించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన ప్రతిపాదనకు ఓకే చెప్పేస్తారా?. లేక గతంలో అసలు రాజధానికి 33 వేల ఎకరాలు ఎందుకు అని ప్రశ్నించిన ఆయన ఇప్పుడు అభ్యంతరం చెపుతారా లేదా అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. ఆయన అభిప్రాయంతో ప్రభుత్వ నిర్ణయం మారకపోవొచ్చు కానీ...గతంలో ఉన్న స్టాండ్ ..ఇప్పుడు మారిందా లేదా ...ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన సమర్థిస్తున్నారా లేదా అన్న ప్రశ్నలు ఉదయించకమానవు.

అయితే కూటమిలో భాగస్వామిగా చేరినప్పటి నుంచి ఆయన సొంతంగా ఏమి ఆలోచిస్తున్నట్లు లేరు అని..చంద్రబాబు ఏది చెపితే దానికే ఓకే చెపుతున్నారు అనే చర్చ టీడీపీ, జనసేన నేతల్లో కూడా ఉంది. అయితే తనకు కావాల్సిన పదవులు..ఇతర అంశాల్లో తప్ప...పవన్ కళ్యాణ్ ప్రభుత్వ నిర్ణయాలకు ఎక్కడా నో చెప్పిన దాఖలాలు లేవు అని..పైగా చంద్రబాబు విజన్ పై ఆయన పదే పదే ప్రశంసలు కురిపిస్తూ కూడా ముందుకు సాగుతున్నారు. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఈ సమీకరణ విషయంలో స్పందిస్తారా లేక ఆయన ఎలాంటి నిర్ణయం చెప్పకుండా ముందుకు సాగుతారా అన్నది వేచిచూడాలి. ఒక వైపు చంద్రబాబు అమరావతి అద్భుత మైన రాజధానికి మారనుంచి అని చెపుతున్నారు. ఇదే నిజం అయితే ఆ ప్రాంతంలో భూముల ధరలు గణనీయంగా పెరుగుతాయి. అలాంటప్పుడు రైతులు తమ భూములు తమ వద్దే ఉంచుకుని లాభం పొందాలని చూస్తారు కానీ ప్రభుత్వం దగ్గరకు వచ్చి మా భూములు తీసుకోండి అని కోరతారా అన్నది ఎవరికీ అర్ధం కానీ విషయం. ఎందుకంటే ప్రభుత్వం మీడియా కు లీకులు ఇచ్చి రైతులు తమ భూములు తీసుకోమని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు రాయించుకున్నారు.

ఇదే నిజం అయినా ఇలా స్వచ్ఛందంగా ముందుకు వచ్చే రైతులు ఎంత మంది ఉంటారు?. ప్రభుత్వం ఎంత మంది నుంచి బలవంతంగా భూమి తీసుకోబోతుంది అన్నదే ఇప్పుడు అత్యంత కీలకం కానుంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. చంద్రబాబు తీసుకున్న అమరావతి రెండవ దశ భూ సమీకరణ ప్రతిపాదన వ్యవహహారం చాలా మంది టీడీపీ నేతలకు కూడా ఏ మాత్రం మింగుడు పడటం లేదు . ఎందుకంటే రాబోయే కాలంలో ఇది రాజకీయంగా పార్టీకి పెద్ద ఎత్తున నష్టం చేసే అవకాశం ఉంది అని...చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కారణంగా పార్టీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అనే చర్చ టీడీపీ నేతల్లో సాగుతోంది.

Next Story
Share it