ఈ ప్రశ్నలకు సమాధానం ఉందా!

(సుంకర వెంకటేశ్వర రావు)
ఈరోజు (బుధవారం) కడపలో జరుగుతున్న మహానాడు వేదిక మీద నుండి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ వైసీపీకి అరాచకశక్తులు కొంతమంది తెలుగుదేశంపార్టీలోకి వలస వచ్చి కోవర్టులుగా పనిచేస్తూ తెదేపాకు నష్టంచేస్తున్నారు, అన్నీ నేను గమనిస్తున్నాను, సహించేదిలేదు అని గట్టిగా హెచ్చరించారు.
ఊరుకోండి సార్ …..మీరు కూడా అప్పుడప్పుడూ భలే జోకులు వేస్తుంటారు.
సరే సంబరం బాగుందిలేగానీ …….మరి మీరనే ఆ కోవర్టులు మీ అనుమతితో సమ్మతితోనే మన పార్టీలో చేరారు, నిత్యమూ అనుక్షణమూ మీ చుట్టూ మీ అబ్బాయి లోకేష్ చుట్టూనే ముఖ్యులుగా ఆంతరంగికులుగా వ్యూహకర్తలుగా సలహాదారులుగా ఉన్నారు కదా సారూ? కొంతమంది పార్లమెంటుకు రాజ్యసభకు శాసనసభకూ శాసనమండలికి సభ్యులుగా మీ పార్టీ నుండే ఎన్నికయ్యారు కదా సారూ?. 1996 నుండీ కూడా మీరు మీ చుట్టూ ఉంటున్నది, మీరు నమ్ముతున్నది కూడా అలాంటి కోవర్టులనే కదా సారూ?. వైఎస్ జగన్మోహన రెడ్డికి గతంలో అత్యంత సన్నిహిత ఆంతరంగికులుగా బినామీలుగా ఉన్నవారు, వైఎస్సార్సీపీకి వందలకోట్ల విరాళాలు ఇచ్చినవారు కాంట్రాక్టర్లు కొంతమంది నేడు మీవద్ద అంతరంగికులుగా సన్నిహితులుగా మారిపోయారు, వాళ్ళకే వందలకోట్ల కాంట్రాక్టులు దక్కుతున్నాయి, ఇదంతా జగద్విదితమే కదా సారూ? అని తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశంపార్టీనే జీవితంగా శ్వాసగా భావించే కార్యకర్తలూ నాయకులూ గత సంవత్సరం నుండీ గగ్గోలు పెడుతున్నారు, వాపోతున్నారు, సిగ్గుతో తల దించుకుంటున్నారు కదా….అవి మీ చెవులకు కళ్ళకు చేరడంలేదా? మీ దృష్టికి రాలేదా?
నా లాగా మీ శ్రేయస్సును పార్టీ అభివృద్ధిని కోరేవారు పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను లోటుపాట్లను మీ దృష్టికి తీసుకువచ్చే ప్రయత్నంలో యదార్థం మాట్లాడుతూ, మీ మంచికోరేవాళ్లంటే మీకు మీ అబ్బాయికి మరియు మీ చుట్టూ ఉన్నవారికి గిట్టదు ఇష్టపడరు కదా సారూ?. ఒకవేళ నేనన్నదాంట్లో వాస్తవం లేకపోతే నేను అన్నది తప్పైతే మీరు ధైర్యంగా కాదని ఖండించండి, లేదా నేను పేర్లతో సహా ఉదాహరణలూ సాక్ష్యాలూ రుజువులతో సహా సోదాహరణంగా చెప్పగలను, మన్నించండి, క్షమించండి సారూ.!
మీకు శుభం జయం కలగాలని కోరుకుంటూ.. భవదీయుడు.
~సువేరా