కేసులు తగ్గుతున్నాయి..ఇంటర్ పరీక్షలు పెడతాం
ఏపీ సర్కారు ఈ మేరకు సుప్రీంకోర్టులో కౌంటర్ దాఖలు చేసింది. కరోనా రెండవ వేవ్ కారణంగా దేశంలోని 21 రాష్ట్రాలు ఇంటర్ పరీక్షలను రద్దు చేశాయి. ఏపీతో పాటు కేరళ తదితర రాష్ట్రాలు మాత్రమే ఇంకా పరీక్షల నిర్వహణకు మొగ్గుచూపుతున్నాయి. దీనిపై మంగళవారం నాడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఒక్క విద్యార్ధి చనిపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.
ఈ మేరకు ఏపీ సర్కారు సుప్రీంలో కౌంటర్ దాఖలు చేస్తూ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని..పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. నెల రోజుల నాటి పరిస్థితికి ప్రస్తుతం చాలా తేడా ఉందని తెలిపింది. జులై చివరి వారంలో పరీక్షలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఈ అంశంపై గురువారం నాడు విచారణ జరిగే అవకాశం ఉంది.