Telugu Gateway
Andhra Pradesh

పాలించేది మేమే..పేర్లు పెట్టుకునేది మేమే!

పాలించేది మేమే..పేర్లు పెట్టుకునేది మేమే!
X

విజ‌య‌వాడ కేంద్రంగా ఉన్న ఎన్టీఆర్ యూనివ‌ర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మార్పు అంశం ఆక‌స్మాత్తుగా ఎందుకు తెర‌పైకి వచ్చింది. ఓ వైపు ప్రాంతాల మ‌ధ్య చిచ్చుపెట్ట‌డం ఇష్టం లేక‌నే రాజ‌ధానిగా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు గ‌తంలో అసెంబ్లీ వేదిక‌గా చెప్పిన సీఎం జ‌గ‌న్..ఇప్పుడు చంద్ర‌బాబు ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెట్టే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. అమ‌రావ‌తి రైతుల పాద‌యాత్ర అర‌స‌వెల్లికి వెళ్ళి మొక్కితే ఆ ప్రాంత ప్ర‌జ‌ల‌కు భావోద్వేగాలు ఉండ‌వా అంటూ అసెంబ్లీ వేదిక‌గా ప్ర‌శ్నించారు. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కం ద్వారా దివంగ‌త రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచిపోయారు. అందులో నో డౌట్. అదే స‌మ‌యంలో ఎన్టీఆర్ కూడా రాజ‌కీయాల్లోకి వ‌స్తూనే సంచ‌లన విజ‌యం న‌మోదు చేసుకుని.. పాల‌న‌లో సంస్క‌ర‌ణ‌లు..సంక్షేమ కార్య‌క్ర‌మాల‌తో చ‌రిత్ర‌లో చెర‌గ‌ని ముద్ర వేశారు. మ‌రి అలాంటి ఎన్టీఆర్ పేరును తొల‌గించి ఆక‌స్మాత్తుగా హెల్త్ యూనివ‌ర్శిటీకి వైఎస్ఆర్ పేరు పెట్టాల‌ని నిర్ణ‌యించ‌టం ఏ మాత్రం ఔచిత్యం అన్పించుకోదు. ఏపీలో కొత్త‌గా క‌ట్టే ఏ ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌కు అయినా వైఎస్ఆర్ పేరు పెడితే ఎవ‌రూ అభ్యంత‌రం చెప్ప‌రు. కానీ ఇప్ప‌టికే ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివ‌ర్శిటీ పేరును తీసేసి వైఎస్ఆర్ పేరు జ‌త చేయ‌టం అంటే ఖ‌చ్చితంగా ఇది కావాల‌ని చేస్తున్నార‌నే అభిప్రాయం క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే ఏపీలో రాజ‌ధాని ర‌చ్చ సాగుతున్న త‌రుణంలో కొత్త‌గా ఈ వివాదాన్ని కావాల‌నే తెర‌పైకి తెచ్చార‌నే అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు కొంత మంది నేత‌లు. ప్ర‌జ‌లు ప‌న్నులు క‌ట్టిన సొమ్ముతో ప‌థ‌కాలు అమ‌లు చేస్తూ వాటికి గ‌తంలో చంద్ర‌బాబు పేర్లు పెట్టుకుంటే..ఇప్పుడు సీఎం జ‌గ‌న్ ఆయ‌న్ను మించి మ‌రీ త‌న పేరును ప్ర‌తి ప‌థ‌కానికి త‌గిలిస్తూ పోతున్నారు.

ఇదే వైసీపీ చంద్ర‌బాబు ప‌లు ప‌థ‌కాల‌కు త‌న పేర్లు పెట్టుకోవ‌టంపై ప్ర‌తిపక్షంలో ఉండ‌గా తీవ్ర విమ‌ర్శలు చేసింది. అధికారంలోకి వ‌చ్చాక మాత్రం లెక్క‌లేన‌న్ని ప‌థ‌కాల‌కు జ‌గ‌న్ పేరు పెడితే మాత్రం ఇప్పుడు ఎవ‌రూ నోరుతెరిచే పరిస్థితి లేదు. ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ..ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న త‌ర్వాత కూడా ఎక్కువ శాతం రాష్ట్రాన్ని పాలిస్తున్న‌ది రాయ‌ల‌సీమ నేత‌లే. విభ‌జ‌న త‌ర్వాత తొలి ఐదేళ్లు చంద్ర‌బాబు ప‌రిపాలించారు. ఇప్పుడు జ‌గ‌న్. వీళ్ల వైఖ‌రి ఎలా ఉంది అంటే పాలించేది మేమే..పేర్లు పెట్టుకునేది మేమే అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ ఓ సీనియ‌ర్ నేత వ్యాఖ్యానించారు. విజ‌య‌వాడ న‌డిబొడ్డున ఉన్న హెల్త్ యూనివ‌ర్శిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తీసేసి..వైఎస్ఆర్ పేరు పెడుతున్నారు..మ‌రి క‌డ‌ప‌లో ఏదైనా ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌కు ఇదే జ‌గ‌న్ ఎన్డీఆర్ పేరు పెడ‌తారా? అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇది స‌మ‌స్య‌ల నుంచి ప్ర‌జ‌ల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించే గెలుకుడు రాజ‌కీయం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాజ‌ధానిని కృష్ణా-గుంటూరు జిల్లాల నుంచి త‌రలించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నా ఈ ప్రాంత ప్ర‌జ‌లు పెద్ద‌గా స్పందించ‌లేదు కాబ‌ట్టే ఇలా జ‌రుగుతున్నాయంటూ ఓ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it