Telugu Gateway
Andhra Pradesh

విశాఖ ఉక్కును ఈ లాభాలు రక్షిస్తాయా?

విశాఖ ఉక్కును ఈ లాభాలు రక్షిస్తాయా?
X

కేంద్రంలోని బిజెపి సర్కారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో మొండిగా ముందుకెళుతోంది. ఎవరెన్ని చెప్పినా సరే డోంట్ కేర్ అంటూ తన దారి తనదే అని స్పష్టం చేయటమే కాదు..అమ్మటం కుదరకపోతే.. మూసివేతే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తమ వైఖరి ఎలా ఉండబోతుందో పలుమార్లు స్పష్టం చేసింది. ఈ తరుణంలో విశాఖ ఉక్కు గురువారం నాడు పలు కీలక విషయాలను వెల్లడించింది. టర్నోవర్ తోపాటు లాభాల విషయంలోనూ ఈ ప్లాంట్ పలు మైలురాళ్ళను అందుకుంది. మరి ఇవి వైజాగ్ స్టీల్ ను ప్రైవేటీకరణ నుంచి రక్షిస్తాయా లేదా అన్నది తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాల్సిందే. కంపెనీ పనితీరును ఆ సంస్థ సీఎండీ పీ కె రథ్ గురువారం నాడు మీడియాకు వివరించారు. 2021 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన విషయాలను వెల్లడించారు. గత ఆర్ధిక సంవత్సరంలో వైజాగ్ స్టీల్స్ టర్నోవర్‌ రూ.18 వేల కోట్లుగా నమోదు అయిందని తెలిపారు.

కర్మాగారం చరిత్రలోనే ఇది రెండో అత్యధిక టర్నోవర్ అని సీఎండీ పీకే రథ్‌ వెల్లడించారు. గురువారం విశాఖ ఉక్కు ప్రగతిపై సీనియర్‌ అధికారులతో సీఎండీ సమీక్ష నిర్వహించారు. గత ఆర్థిక సంవత్సరంలో ప్లాంట్ 13 శాతం వృద్ధి నమోదు చేసిందని, ఈ 4 నెలల్లో రూ.740 కోట్ల నికర లాభం నమోదైందని సీఎండీ తెలిపారు. మార్చిలో 7,11,000 టన్నుల ఉక్కు రూ.3,300కోట్లకు విక్రయించామని చెప్పారు. కర్మాగారం చరిత్రలో ఈ మార్చిలో అత్యధిక ఆదాయం వచ్చిందని పీకే రథ్‌ తెలిపారు. కేంద్రం తాజాగా పీఎస్ యూల డిజిన్వెస్ట్ మెంట్ సందర్భంగా ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు రాకుండా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని సూచించింది.

Next Story
Share it