Telugu Gateway
Andhra Pradesh

భూముల విక్రయ సలహాదారుగా ఎన్ బిసిసి

భూముల విక్రయ సలహాదారుగా ఎన్ బిసిసి
X

ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార, ప్రతిపక్ష పార్టీలు కేసు ల గొడవ లో ఉంటే కేంద్రంలోని మోడీ సర్కారు మాత్రం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములు అమ్మే పని వేగవంతం చేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో నిరుపయోగంగా ఉన్న భూముల విక్రయానికి సంబంధించి తాజాగా ఒక ఒప్పందం జరిగింది. కేంద్ర ఉక్కు శాఖతో పాటు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐ ఎన్ ఎల్), నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ , నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్ బిసిసి) ల మధ్య ఒప్పందం జరిగింది. విశాఖపట్నం లోని స్టీల్ ప్లాంట్ లో ఉన్న భూముల విక్రయానికి సంబంధించి నేషనల్ బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్ (ఎన్ బిసిసి) సాంకేతిక, లావాదేవీ సలహాదారుగా వ్యవహరించనుంది. అంటే భూముల విక్రయానికి సంబధించి సలహాలు, తగు సూచనలు ఇవ్వనుంది ఈ సంస్థ అన్న మాట. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో మొత్తం 19730 ఎకరా భూమి ఉండగా ప్లాంట్ తో పాటు ఇతర అనుబంధ కార్యక్రమాల కోసం 12000 ఎకరాలను ఉపయోగిస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే. అధికార,ప్రతిపక్ష పార్టీలు ఏదో మొక్కుబడి ప్రకటనలు చేసి వదిలేశాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎంత పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా కేంద్రం మాత్రం తన నిర్ణయం నుంచి వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదు అని తేల్చిచెపుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు స్టీల్ ప్లాంట్ లో భూముల అమ్మకానికి రెడీ అయింది. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే ఏడు వేల ఎకరాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకే సారి ఈ భూములను అమ్మకానికి పెడతారా లేక...దశల వారీగా అమ్ముతారా అన్నది వేచిచూడాల్సిందే. మధ్యలో ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి కి 1400 ఎకరాలు లీజ్ కు ఇవ్వాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు అంటూ పోరాడి సాధించుకున్న, ఎంతో సెంటి మెంట్ తో ముడిపడి ఉన్న స్టీల్ ప్లాంట్ ను కేంద్రం విక్రయానికి పెడుతుంటే కీలక పార్టీ లు మౌన ప్రేక్షకుల్లా చేస్తున్నాయనే చెప్పాలి.

Next Story
Share it