జగన్ అఖిలపక్ష అపాయింట్ పై స్పందించని మోడీ
కొత్త సమస్య వస్తుంది. పాతది అంతా మర్చిపోతారు. విశాఖ ఉక్కు..ఆంధ్రుల హక్కు అంటూ కొన్ని రోజుల పాటు ఏపీలో ఓ స్థాయి ఉద్యమాలు..నినాదాలు సాగాయి. మధ్యలో కరోనా రెండవ దశ వ్యాప్తి ఎక్కువ కావటంతో అంతా గప్ చుప్. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై చర్చించేందుకు అపాయింట్ మెంట్ ఇవ్వాలని మార్చి9న ప్రధాని నరేంద్రమోడీకి లేఖ రాశారు. అఖిలపక్ష నేతలతోపాటు స్టీల్ ప్లాంట్ యూనియన్ నేతలను కూడా తీసుకువస్తానని..ప్రైవేటీకరణ కాకుండా ప్రత్యామ్నాయాలపై చర్చించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. సీఎం జగన్ లేఖ రాసి నాలుగు నెలలు కావస్తోంది. కానీ ప్రధాని కార్యాలయం నుంచి ఇంత వరకూ స్పందన వచ్చిన దాఖలాలు లేవు. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఓ తీర్మానం చేసింది. కానీ ఢిల్లీ స్థాయిలో..ప్రధాని మోడీతో సీఎం జగన్ భేటీ అయి ఈ అంశంపై చర్చించే ప్రయత్నం జరగలేదు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే అధికార వైసీపీతోపాటు అందరూ కూడా ఈ అంశాన్ని పూర్తిగా వదిలేసినట్లే కన్పిస్తోంది.
వాస్తవానికి విభజన చట్టం ప్రకారం రాయలసీమలోని కడప జిల్లాలో కేంద్రమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. అది చేయకపోగా..ఏపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను అమ్మకానికి పెట్టడమే కాదు..రాష్ట్రంలోని పార్టీలు అన్నీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నా మోడీ సర్కారు డోంట్ కేర్ అంటోంది. అంతే కాదు..కేంద్ర మంత్రులు ఈ అంశంపై దారుణమైన ప్రకటనలు చేశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మటం సాధ్యం కాకపోతే మూసివేస్తామంటూ మరీ వ్యాఖ్యానించి కలకలం రేపారు. తాజాగా కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి చర్యలను మరింత వేగవంతం చేసింది. మరి ఇప్పటికైనా ఏపీ సర్కారు అఖిలపక్ష సమావేశం కోసం మరోసారి ప్రయత్నం చేస్తుందా..లేక అంతే వదిలేస్తుందా అన్నది వేచిచూడాల్సిందే. విభజన సందర్భంగా ఇచ్చిన భారీ హామీలే కాదు..చిన్న చిన్న హామీలను కూడా కేంద్రం ఏ మాత్రం పట్టించుకోవటం లేదు.అయినా ఈ అంశాలపై నిలదీసే పరిస్థితిలో ఏపీలోని పార్టీలు లేవు.