Telugu Gateway
Andhra Pradesh

ఇరకాటంలో వైసీపీ సర్కారు

ఇరకాటంలో వైసీపీ సర్కారు
X

ప్రతిపక్షాలు విమర్శలు చేస్తే దాన్ని రాజకీయం అంటారు. కానీ సొంత పార్టీ ఎంపీ..అది కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా అధికార వైసీపీ చెపుతున్న విశాఖపట్నం ఎంపీ నే ఇక్కడ వ్యాపారాలు చేయటం కష్టంగా ఉంది...ఇక నా వ్యాపారాలు హైదరాబాద్ కు మారుస్తా అంటూ చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇది అధికార వైసీపీ కి కూడా పెద్ద దెబ్బే అని ఆ పార్టీ నేతలు కూడా అంగీకరిస్తున్నారు. గతంలో టీడీపీ నేతలు రాష్ట్రం నుంచి అమరారాజా లాంటి సంస్థలను వెళ్ళగొట్టారని విమర్శలు గుప్పించగా...మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి లాంటి వారు తామే అమరారాజాను వెళ్ళమన్నామని ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు సొంత పార్టీ ఎంపీ చేసిన కామెంట్స్ పై వైసీపీ నేతలు స్పందిస్తారా లేక అలా వదిలేస్తారా అన్నది వేచిచూడాల్సిందే. తాను విశాఖపట్నంలో ఓ భారీ ప్రాజెక్టు చేపట్టానని, అందులో రాయి ఉండడంతో బ్లాస్టింగ్‌ చేయాల్సి ఉందని, దానికోసం 45 రోజుల క్రితం దరఖాస్తు చేస్తే ఇప్పటివరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. అదే హైదరాబాద్‌లో దరఖాస్తు చేస్తే 24 గంటల్లో అనుమతి ఇచ్చారని చెప్పారు. అందుకే వ్యాపారం హైదరాబాద్ లో , ప్రజాసేవ కోసం రాజకీయాలు విశాఖపట్నంలో చేస్తానని ప్రకటించారు.

ఈ వార్తలు ఇటు తెలుగు మీడియా తో పాటు ఇంగ్లీష్ పత్రికల్లో కూడా ప్రముఖంగా రావటంతో ఇది వైసీపీ ప్రభుత్వం పరువు తీయటం ఖాయం అని సొంత పార్టీ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కొద్దిరోజుల క్రితం జరిగిన బహిరంగ సభలో విశాఖపట్నం అక్రమార్కులకు అడ్డాగా మారిపోయింది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయన ఈ మాటలు అన్న కొద్దిరోజులకే ఏకంగా వైజాగ్ ఎంపీ సత్యనారాయణ కుమారుడిని, భార్యను, అయన స్నేహితుడైన ఆడిటర్‌ జీవీని ఓ ముఠా కిడ్నాప్‌ చేసి నిర్బంధించి..పెద్ద ఎత్తున నగదు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఒక డీల్ లో వచ్చిన లెక్కల తేడాతోనే ఇది జరిగింది అనే ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో ఉంది. అయితే డబ్బుల కోసమే ఆ ముఠా తన కుటుంబాన్ని నిర్బంధించిందని ఎంపీ సత్యనారాయణ చెబుతున్నారు. కారణాలు ఏమైనా సరే వైజాగ్ ఎంపీ చేసిన కామెంట్స్ అధికార వైసీపీని ఎన్నికల ఏడాదిలో ఇరకాటంలోకి నెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

Next Story
Share it