Telugu Gateway
Andhra Pradesh

వచ్చే ఏడాదే భోగాపురం ఎయిర్ పోర్ట్..కీలక ప్రాజెక్టులు

వచ్చే  ఏడాదే భోగాపురం ఎయిర్ పోర్ట్..కీలక ప్రాజెక్టులు
X

రాష్ట్ర విభజనకు ముందు నుంచి కూడా ఇతర ప్రాంతాల వాళ్ళను తమతో ఈజీగా కలుపునే లక్షణం ఉన్న సిటీ వైజాగ్. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ తర్వాత వైజాగ్ కు మాత్రమే ఈ ప్రత్యేక లక్షణం ఉంది. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. పోర్ట్ తో పాటు వైజాగ్ స్టీల్ ప్లాంట్..ఇతర పరిశ్రమలు ఉండటం వంటి కారణాలతో వైజాగ్ లో ఏ రాష్ట్రం నుంచి వచ్చినా ..ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లకు అయినా పెద్దగా ఇబ్బందులు ఉండేవి కావు. వచ్చే ఐదేళ్లలోనా....పదేళ్లలోనా అంటే చెప్పటం కష్టం కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మరో హైదరాబాద్ నగరంలా అభివృద్ధి అయ్యే ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఒక్క వైజాగ్ మాత్రమే అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కారణాలు ఏమైనా కూడా ఆంధ్ర ప్రదేశ్ లోని కూటమి సర్కారు కూడా ఇప్పుడు వైజాగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది అనే చెప్పాలి. ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చే పెట్టుబడి ప్రతిపాదనల్లో ఎక్కువ మొత్తం ఎక్కువ వైజాగ్ ఏరియాలోనే ల్యాండ్ అవుతున్నాయి. వీటికి తోడు వచ్చే ఏడాదే భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కూడా అందుబాటులోకి రానుంది. ఇది ఒక ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందటానికి అవసరం అయ్యే ఎయిర్ కనెక్టవిటీ తీసుకురావటంలో కీలక పాత్ర పోషించనుంది.

వైజాగ్ కు సంబంధించి మంగళవారం నాడు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా కీలక ఒప్పందం జరిగింది. దిగ్గజ ఐటి సంస్థ వైజాగ్ లో ఒక గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తో పాటు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్ లు పాల్గొన్నారు. వైజాగ్ ను దేశ ఏఐ సిటీ గా మార్చేందుకు ఈ డీల్ ఎంతో కీలకంగా మారనుంది అని అధికారులు చెపుతున్నారు. ఈ ప్రాజెక్ట్ లో భాగంగా గూగుల్ మొత్తం 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనుంది. ఈ ప్రాజెక్ట్ లో దేశానికి చెందిన కీలక సంస్థలు అయిన అదానీ, భారతి ఎయిర్ టెల్ లు కూడా భాగస్వాములు అవుతున్నాయి. దీనికి ప్రభుత్వం కూడా వేల కోట్ల రూపాయల మేర రాయితీలు ఇస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో గూగుల్ ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ రెండు సంస్థలు అంటే అదానీ , భారతి ఎయిర్ టెల్ లు కూడా అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించాయి. వీటితో పాటు ఇప్పటికే వైజాగ్ లో దేశంలోనే నంబర్ వన్ ఐటి కంపెనీ టిసిఎస్ క్యాంపస్ ఏర్పాటు కు ప్రభుత్వం నుంచి భూమి తీసుకున్న విషయం తెలిసిందే.

దీంతో పాటు కాగ్నిజెంట్ కూడా వైజాగ్ లో క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. రాబోయే రోజుల్లో మరికొన్ని కీలక సంస్థల డేటా సెంటర్ ప్రాజెక్ట్ లు వైజాగ్ కు వచ్చే అవకాశం ఉంది అని అధికార వర్గాలు చెపుతున్నాయి. ఇవే కాకుండా వచ్చే నవంబర్ లో జరిగే భాగస్వామ్య సదస్సు ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు సాధించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి ని వేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నా కూడా పారిశ్రామికంగా...ముఖ్యంగా ఐటి , ఆర్థిక సేవల విషయంలో ఫోకస్ అంతా కూడా వైజాగ్ వైపు చేస్తుండంతో రాబోయే సంవత్సరాల్లో వైజాగ్ ఏపీ హైదరాబాద్ గా మారటం ఖాయం అని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అవసరం అయిన అన్ని అవకాశాలు ఈ సిటీ కి పుష్కలంగా ఉన్నాయని చెపుతున్నారు.

Next Story
Share it